సోమశిల: సోమశిల జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ గ్యాలరీ, రిటైనింగ్ వాల్‌తో పాటు ప్రధానమైన జలాశయ ప్రాంతాలను పర్యవేక్షించారు. భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చేపటాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను త్వరలోనే అందజేయనున్నామని వెల్లడించారు. సేఫ్టీ కమిటీ సభ్యులను ఈఈ శ్రీనివాస్‌కుమార్ సత్కరించారు. డీఈఈలు రవీంద్రప్రసాద్, విజయ్‌కుమార్, జేఈలు పెద్దిరాజు, పాపిశెట్టి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
4 నుంచి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
అల్లూరు: రాష్ట్ర సీనియర్స్ పురుషులు, సీ్త్రల బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలను సెప్టెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు నిర్వహించనున్నారు. స్థానిక రామకృష్ణ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో మురళీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం జరపనున్న పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ విజయ్‌శంకర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, న్యాయనిర్ణేతలకు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నామని వెల్లడించారు. విజేతలకు బహుమతులను అందజేయనున్నారని చెప్పారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మేడా రామసుబ్బారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు రమేష్ బాబు, క్రాంతికుమార్, మురళి, మోహన్, సుబ్బన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
నెల్లూరు(అర్బన్): ఎంబీబీఎస్‌ను పూర్తి చేసి స్పెషలిస్ట్ కోర్సులో చేరేందుకు అవసరమైన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్.. కావలిలోని విశ్వోదయ కళాశాలలు.. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం వద్ద గల డిజిటల్ అయాన్ సెంటర్, జైశ్రీరామ్ ఇన్‌ఫ్రా ఐటీ సొల్యూషన్స్ సెంటర్‌లో పరీక్షలను నిర్వహించారు. 950 మందికి గానూ 34 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 85,246 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,085 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.3 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
ఉదయగిరి దుర్గం సందర్శన
ఉదయగిరి: ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నానికి చెందిన నేవీ బృందం ఆదివారం సందర్శించింది. దుర్గంపై ఉన్న పెద్ద, చిన్న మసీదులు, గుర్రపుశాల, కోనకాలువ తదితరాలను పరిశీలించారు. ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధనౌక ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నౌక పేరుతో ఉన్న ఉదయగిరిని సందర్శించామని తెలిపారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 2026 – 27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.పది వేలు, రూ.ఐదు వేల చొప్పున అందించాలని కోరుతూ ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుకు ఇచ్చారు.


