తవ్వకాల్లోనూ నిబంధనలు బేఖాతరు | - | Sakshi
Sakshi News home page

తవ్వకాల్లోనూ నిబంధనలు బేఖాతరు

Aug 26 2026 12:00 AM | Updated on Aug 26 2026 12:00 AM

గూడూరు తీరంలో సిలికా గనులు.. కాసుల గనులుగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన సిలికాపై ప్రైవేట్‌ సంస్థ గుత్తాధిపత్యం సాగిస్తూ.. గని యజమానుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి, అదే సిలికాను భారీ ధరకు విక్రయిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులున్న గనుల నుంచి తవ్వకం మొదలు డంపింగ్‌ యార్డుకు తరలింపు వరకు ఆ సంస్థ కనుసన్నల్లోనే జరుగుతోంది. రోజుకు వందకు పైగా లారీల్లో వేల టన్నుల సిలికా తరలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుండగా ప్రభుత్వ పెద్దల ఖజానా నిండుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిలికా రవాణాలో ప్రైవేట్‌ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలు ఎగ్గొట్టేందుకు ప్రతి నాలుగు నెలలకు కొత్త కంపెనీని తెరపైకి తెచ్చి కొత్త తరహాలో దోపిడీకి పాల్పడుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతంలో అరుదుగా దొరికే సిలికా దోపిడీకి తెరతీశారు. సిలికా గనులను తమ అధీనంలోకి తీసుకుని కాసుల వేట ఆరంభించారు. తమ కనుసన్నలో ఉండే ఓ ప్రైవేట్‌ సంస్థను ఎంపిక చేసి సిలికా రవాణా బాధ్యతలను వారికి అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. తమ సంస్థ ముద్ర లేకుండా ఎలాంటి రవాణా చేసేందుకు వీల్లేకుండా కట్టడి చేశారు. దీంతో సిలికా రవాణా మొత్తం వారి కనుసన్నలోనే జరుగుతుండడం విశేషం.

గూడూరు నియోజకవర్గంలో 114 సిలికా గనులుండగా, దాదాపు 60కు పైగా లీజు అనుమతులున్నాయి. కానీ టీడీపీ నేతల గుత్తాధిపత్యం నేపథ్యంలో కేవలం 33 గనుల్లో మాత్రమే మైనింగ్‌ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్‌ టీడీపీ అధికారంలోకి రాగానే సిలికా యజమానులకు కాసుల వర్షం కురిపిస్తామని, యజమానులే రాయల్టీ చెల్లించి స్వయంగా రవాణా చేసుకునేలా చేస్తానంటూ ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పెద్దలు తమ బినామీగా బీడీఎం ప్రైవేట్‌ సంస్థను పెట్టుకుని మైనింగ్‌ దోపిడీకి తెరతీశారు. అనుమతులున్న గనుల యజమానులకు మాత్రం టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఇచ్చి ఆ ప్రైవేట్‌ సంస్థే కొనుగోలు చేసి రవాణా చేసుకోనేలా అనధికారంగా నిబంధనలు విధించారు.

హవా అంతా ప్రైవేట్‌ సంస్థదే

రోజుకు కోటి రూపాయలకు పైగా జరిగే సిలికా వ్యాపారంపై బీడీఎం ప్రైవేట్‌ సంస్థ చిల్లకూరు మండలం అంకులపాటూరు వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డుకు సిలికాను ఇక్కడ డంపింగ్‌ చేసి అక్కడి నుంచి టన్ను రూ.1700 లెక్కన విక్రయిస్తోంది. గనుల యజమానుల వద్ద టన్ను రూ.300లకు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ.. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక శాతం రాయిల్టీ చెల్లిస్తోంది. ఇక టన్నుకు రూ.500 చొప్పున ప్రతి నెలా నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేర్చుతున్నారనే ఆరోపణలున్నాయి.

ఓవర్‌ లోడేజీ.. అడిగే వారెవరు జీ

సిలికా గనుల నుంచి ఒక లారీలో అనుమతి మేరకు 22 నుంచి 25 టన్నుల వరకు మాత్రమే తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేట్‌ సంస్థ నిర్వాహకులు మైన్‌ నుంచి ఒక లారీకి కనీసం 45 నుంచి 50 టన్నుల సిలికాను తరలిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ దొరికే సిలికాకు మంచి గిరాకీ ఉండడంతో గ్లాస్‌, ఇండాలియం పరిశ్రమలు సిలికాకు ఆర్డర్లు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం నుంచి డీలర్లు ద్వారా రోజుకు కనీసం వందకు పైగా లారీల్లో సిలికా తరలిపోతోంది. ఒక లారీకి కనీసం 45 టన్నుల చొప్పున వంద లారీల్లో నిత్యం సుమారు 4500 టన్నులు సిలికా రోజు తరలిపోతోంది.

గూడూరు డివిజన్‌లో 114 గనుల్లో 33 ఓపెన్‌

చినబాబు కనుసన్నల్లోనే దోపిడీ

బీడీఎం సంస్థ గుత్తాధిపత్యంలోనే సిలికా తవ్వకాలు

అనుమతులున్న యజమానులకు టన్నుకు రూ.250 మాత్రమే

బీడీఎం సంస్థ మాత్రం టన్ను

రూ.2 వేలకు పైగా విక్రయం

నెలకు రూ. కోట్లలో ప్రభుత్వ పెద్దలకు?

తరచూ సంస్థ పేర్లు మార్చుతూ దోపిడీ

అనుమతులు లేని

మైన్‌లే టార్గెట్‌

కాలం చెల్లిన మైన్‌లలో తవ్వకాలను పూర్తిగా నిలిపి వేశారు. ప్రస్తుతం సిలికా తరలింపు చేపట్టిన సంస్థ ఎక్కడా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టకూడదని ప్రకటించారు. అయితే కాలక్రమంలో మాటా దాట వేసిన సంస్థ ప్రతినిధులు ఏకంగా కాలం చెల్లిన మైన్లపై దృష్టి పెట్టారు. దీంతో ఎక్కడ మైన్‌లు ఖాళీ చేశారో అక్కడ రోడ్లు, మిగిలిన సిలికాను డంపింగ్‌ యార్డుకు తరలించి అక్కడి నుంచి పరిశ్రమలకు తరలిస్తున్నారు.

ప్రభుత్వం అనుమతి పొందిన ఈ ప్రైవేట్‌ సంస్థ సిలికా తరలింపుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక సంస్థ పేరుతో సిలికా తరలింపులు చేపడితే భవిష్యత్‌లో లెక్కలు చెప్పాల్సి వచ్చిన సమయంలో ఇబ్బందులు ఉంటాయని సంస్థ ప్రతినిధులు ప్రతి నాలుగు నెలలకు ఒక కొత్త సంస్థను తెరపైకి తెచ్చి దోపిడీకి పాల్పడుతోంది. ఈ రెండేళ్లలో 8 సంస్థల పేర్లు మార్పులు చేసి ఆయా సంస్థల పేరుతో వే బిల్లులు ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధిక లోడుతో వెళ్లే లారీల్లో కొంత మేర మాత్రమే బిల్లులు వేసి మిగిలిన దానికి బిల్లులు లేకుండా పంపి దానిపై వచ్చిన ఆదాయం మొత్తం చిన్నబాబుకు అప్పగిస్తున్నట్లు సమాచారం.

సిలికా గనులు లీజుకు తీసుకునే సమయంలో యజమానులు పర్యావరణం దెబ్బతినకుండా కూలీలతో సిలికాను తవ్వి తరలిస్తామని హామీ ఇస్తారు. సుమారు 15 అడుగుల లోతు మేర మాత్రమే తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలను యజమానులు నిబంధనలు తుంగలో తొక్కి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన బఫర్‌ జోన్‌ దాటి.. సుమారు 30 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. సిలికా తవ్వకాల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నా.. గనులశాఖ, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి అంతా బాగుందని చెప్పి వెళ్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement