రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాదా..? | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాదా..?

Jun 5 2026 12:30 AM | Updated on Jun 5 2026 12:30 AM

ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడిన అధికార పార్టీ

ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేతలు

బ్లాక్‌ డేగా పరిగణిస్తాం

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

చిల్లకూరు: రాజ్యాంగాన్ని గౌరవించడం టీడీపీ నేతలకు చేతకాదని.. ఒక పార్టీ తరఫున గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురిచేసి.. ఫిరాయింపులకు ప్రోత్సహించి.. కోటలో నిర్వహించిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని గొప్పలు చెప్పుకొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. కోటలోని ఓ అతిథి గృహంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌, సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కొడవలూరు భక్తవత్సలరెడ్డితో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. కోట ఎంపీపీ ఉప ఎన్నిక జరిగిన ఈ రోజును బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇక్కడి ఎంపీపీ కాలపరిమితి నాలుగు నెలలుండగా, అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు గానూ తమ పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అప్రజాస్వామికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎంపీపీ అభ్యర్థిని ఎన్నిక జరిగే ప్రాంతానికి రానీయకుండా భయభ్రాంతులకు గురిచేసి.. వారి అభ్యర్థి ఒక్కరే హాజరైనట్లు ప్రకటించుకున్నారని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేపట్టారో.. అదే తరహాలో కోటలోనూ అధికార పార్టీ నేతలు వ్యవహరించారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం తమ పార్టీ తరఫున ఎంపీటీసీలుగా 13 మంది.. టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులకు బలవంతంగా టీడీపీ కండువాలు కప్పి అధికారాన్ని దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటుదారులకు భవిష్యత్తులో ఎక్కడా స్థానం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన వారిని టీడీపీ వైపు తిప్పకోవడంతోనే గెలుపనుకుంటే పొరపాటని, ఇలాంటి పోకడలు వారి దిగజారుడుతనానికి, సిగ్గుమాలినతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. సొంతంగా గెలవలేని వారు ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడటం దౌర్భాగ్యమని విమర్శించారు. చంద్రబాబు దుష్టపాలన, నియంతృత్వ పోకడలను ప్రజలకు తెలియజేసేందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, తమ వెంటే ఉన్న ఎంపీటీసీలను ఆయన అభినందించారు.

తీరని మచ్చ

కోటలో నిర్వహించిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అవలంబించిన ఫిరాయింపుల పర్వం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీటీసీలకు టీడీపీ కండువాలు కప్పి తమ వారిగా ఆ పార్టీ ప్రకటించడాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం అభాసుపాలవుతోందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. చంద్రబాబు సైతం ఇలాంటి రాజకీయాలు చేయడంతో కింది స్థాయి నేతలూ వీటినే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉన్న వారిని గుర్తిస్తామని ప్రకటించారు. ఇలాంటి దుష్ట రాజకీయాలకు ఇప్పటికై నా గూడూరు నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు ముందుకురావాలని కోరారు. కోట, చిట్టమూరు మండలాల పార్టీ కన్వీనర్లు పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీలు సౌజన్యారెడ్డి, శేషయ్య, రాజేశ్వరి, అంకమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement