ఇంటికెళ్తుండగా..
● టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
గూడూరు రూరల్: గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ నుంచి మినీబైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఒకటో పట్టణ ఎస్సై మనోజ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన మంద శ్రీనివాసులు (31)కి వివాహమైంది. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో గూడూరు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం పెయింట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పనులు ముగించుకుని సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా టిప్పర్ వేగంగా ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. తల ఛిద్రమైంది. పోలీసులు మంగళవారం మృతదేహానికి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు షేక్ కై సర్, షేక్ ఉస్మాన్ అలియాస్ దావూద్‌పై మంగళవారం నెల్లూరు చిన్నబజారు పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో స్థానిక ఇన్‌స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. నగరంలోని కోటమిట్ట షాదీమంజిల్ సమీపంలో షేక్ కై సర్ నివాసముంటున్నాడు. అతనిపై చిన్నబజారు స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. హత్య కేసుతోపాటు పలు కేసులున్నాయి. జనార్దనరెడ్డి కాలనీకి చెందిన షేక్ ఉస్మాన్ అలియాస్ దావూద్ ప్రస్తుతం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని వైఎస్సార్ నగర్‌లో ఉంటున్నాడు. అతనిపై చిన్నబజారు స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. ఇంకా హత్య, ఎన్‌డీపీఎస్ కేసుతోపాటు పలు కేసులున్నాయి. సత్ప్ర వర్తనతో మెలగాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని నిందితులను పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నా తీరులో మార్పు రాలేదు. దీంతో కలెక్టర్ అనుమతితో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
● ఏడాది వ్యవధిలో 20 మందికిపైగా రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించారు. ఇద్దరిపై పిట్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ నమోదు చేశారు. మరికొందరిపైనా త్వరలో యాక్ట్ ప్రయోగించనున్నారు.
ఇంటికెళ్తుండగా..


