వైఎస్ జగన్ పర్యటనకు అన్ని అనుమతులు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి
● హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యల పరిశీలన
నెల్లూరు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నెల్లూరు పర్యటనకు అన్ని అనుమతులు తీసుకున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని కనుపర్తిపాడు జెడ్పీ పాఠశాల వద్ద హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 26వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్‌లో వివాహ వేడుకలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని 11 గంటలకు తిరుగు ప్రయాణమవుతారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకు ఆయన పర్యటనతో ఉత్సాహం నిండిందన్నారు. కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో పోలీసులు నామమాత్రంగా ఉండడంతో గందరగోళం నెలకొందన్నారు. ఈ సారి అటువంటి పరిస్థితులు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని, గత చేదు అనుభవనాలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీని కోరారు. పర్యటనకు ఉత్సాహంగా స్వాగతం పలకాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అభిమానులు, కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని విన్నవించారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో సాధారణ ప్రజలకు కూడా ఇబ్బంది తలెత్తకుండా పోలీసుశాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.


