తెల్లరాయి గనుల్లో పరిశీలన
సైదాపురం: ఫిర్యాదుల మేరకు మైకా, తెల్లరాయి గనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నామని జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని పొక్కందల, మొలకలపూండ్ల గ్రామాల్లో గల పీబీజే, ఒగ్గు కృష్ణయ్య గనులను మైనింగ్ అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో మంగళవారం పరిశీలించింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఫిర్యాదు మేరకు అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. కూటమి నేతల ఫిర్యాదులపై ఈ రెండు తెల్లరాయి గనుల లీజులకు సంబంధించిన భూముల వివరాలు, రికార్డులతో పాటు సర్వే చేపట్టారు. తెలుగు గంగ కాలువను ఆక్రమించడంతో పాటు హై బ్లాస్టింగ్ చేపట్టడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, అదే విధంగా సమీపంలోని నిమ్మ తోటలు పూర్తిగా నాశనమవుతున్నాయని ఫిర్యాదు లు అందాయని చెప్పారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని చెప్పారు.


