తీరంలో ఇసుక దొంగలు | - | Sakshi
Sakshi News home page

తీరంలో ఇసుక దొంగలు

Feb 25 2026 10:29 AM | Updated on Feb 25 2026 10:29 AM

తీరంలో ఇసుక దొంగలు

తీరంలో ఇసుక దొంగలు

‘ప్రభుత్వం మాది. ఏం చేసినా అడగడానికి లేదు’ ఇది తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు తీరాన్ని ఇసుక మాఫియా వదల్లేదు. తీరప్రాంత పరిరక్షణ మండలి నిబంధనల ప్రకారం తీరంలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. కానీ అదంతా కాగితాలకే పరిమితం. జేసీబీలతో ఇసుక తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి, పగలనే తేడా

లేకుండా ఈ దందా జరుగుతోంది.

ఇందుకూరుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం నేతలు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. మండలంలోని మైపాడు సముద్ర తీరం ఇప్పుడు టీడీపీలోని ఓ కీలక నేతకు ఏటీఎంలా మారింది. నిబంధనల్ని తుంగలో తొక్కి సముద్రపు ఇసుకను తోడేస్తున్నారు. ప్రకృతి సంపదను పచ్చనేతలు తమ సొంత ఖజానాకు మళ్లించుకుంటున్నారు.

అతని కనుసన్నల్లోనే..

మైపాడు తీరంలో జరుగుతున్న ఇసుక దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత హస్తం ఉన్నట్లు సమాచారం. అతని కనుసన్నల్లోనే జేసీబీలతో తవ్వకాలు జరుగుతున్నాయి. తీర ప్రాంతంలో లేఅవుట్లు వేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వారికి సదరు నాయకుడు పూర్తి అభయం ఇస్తుండటంతో, అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ‘మా నేత ఉన్నాడు.. మాకేం కాదు’ అంటూ పచ్చ తమ్ముళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు.

వాటి కోసమే..

తీరానికి ఆనుకుని ఉన్న భూముల్లో భారీ లేఅవుట్లు వేస్తున్న కొందరు నేతలు వాటిని చదును చేయించేందుకు సముద్రపు ఇసుక దిబ్బలను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇసుక తిన్నెలను నామరూపాల్లేకుండా చేస్తున్నారు. తీరం కోతకు గురికాకుండా కాపాడే ఈ దిబ్బలను తొలగించడంతో భవిష్యత్‌లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా కాసుల కక్కుర్తిలో ఉన్న నేతలకు అవేమీ పట్టడం లేదు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. కూటమి నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఆపై అందుతున్న నజరానాల వల్లే మౌనం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించే సామాన్యులను పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

పచ్చ జేబుల్లోకి ప్రజా ధనం

ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్యుడికి దొరక్కుండా చేస్తోంది. అదే సమయంలో తమ అనుచరులకు మాత్రం తీర ప్రాంతాన్ని రాసిచ్చినట్లు వ్యవహరిస్తోంది. మైపాడు తీరంలో జరుగుతున్న ఈ దోపిడీతో పర్యాటక రంగం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికై నా కలెక్టర్‌ స్పందించి, మైపాడు తీరంలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

చీకటి ఒప్పందాలు

తీరంలో ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు కళ్లు మూసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. కీలక నేత నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ ముందు చట్టాలు తలవంచుతున్నాయి. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలకు వెళ్లాల్సిన శాఖలు మామూళ్ల మత్తులో తూగుతున్నాయి.

అడ్డుకున్న స్థానికులు

సోమవారం రాత్రి జేసీబీలు, టిప్పర్లు ద్వారా మట్టిని తరలిస్తుండగా స్థానిక మత్స్యకారులు అడ్డుపడ్డారు. సముద్రానికి అనుకుని ఉన్న ఈ ప్రాంతంలో దిబ్బలను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో టిప్పర్లను, జేసీబీలను తరలించాల్సి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీర గ్రామాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కూటమి నేతల అరాచకానికి అడ్డుకట్ట పడకపోతే మైపాడు పర్యాటక రంగం దెబ్బతినడం ఖాయం.

మైపాడు బీచ్‌లో యథేచ్ఛగా

తవ్వి అక్రమ రవాణా

లేఅవుట్ల కోసం సముద్రపు దిబ్బల

విధ్వంసం

చక్రం తిప్పుతున్న టీడీపీ బడా నేత

మామూళ్ల మత్తులో యంత్రాంగం

ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement