అడిగేదెవరు.. ఆపేదెవరు! | - | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు.. ఆపేదెవరు!

Aug 27 2025 9:59 AM | Updated on Aug 27 2025 9:59 AM

అడిగే

అడిగేదెవరు.. ఆపేదెవరు!

నెల్లూరు(టౌన్‌): జిల్లాలో రోజుకోచోట సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఎలాంటి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇందులో పన్ను చెల్లించని ఇతర రాష్ట్రాలకు చెందిన 6 బండ్లను పట్టుకున్నారు. ఒక స్కార్పియోకు అయితే ఎలాంటి పత్రాల్లేవు.

రిజిస్ట్రేషన్‌ లేకుండానే..

సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల అమ్మకాలు, కొనుగోలు వ్యాపారం చేయాలంటే రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. జిల్లాలో 100కు పైగా సంస్థలు బోర్డులు పెట్టి వ్యాపారం చేస్తున్నాయి. అయితే దేనికి కూడా రిజిస్ట్రేషన్‌ లేకపోవడం గమనార్హం. ఇటీవల ఢిల్లీతోపాటు కొన్ని రాష్ట్రాల్లో పది సంవత్సరాల పైబడిన వాహనాలను తిరగకుండా నిషేధించారు. దీంతో పెద్ద కంపెనీలకు చెందిన వాటిని కూడా తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారులు ఢిల్లీతోపాటు గుజరాత్‌, హరియాణా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. కాగా వీటిలో కొన్ని చోరీకి గురైన బండ్లు ఉన్నట్లు సమాచారం.

నిబంధనలు పట్టించుకోకుండా..

ఇతర రాష్ట్రాల వాహనాలు ఏపీలో ఏ ప్రాంతంలోనైనా నెలరోజుల కంటే ఎక్కువ రోజులు తిప్పకూడదనే నిబంధన ఉంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఇక్కడ తిప్పుకోవాలంటే వాహన మోడల్‌ను బట్టి 8 నుంచి 14 శాతం పన్ను చెల్లించాలి. ఏపీ నంబర్‌పై రీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. అలా చేస్తేనే అన్ని పత్రాలు ఫోర్స్‌లో ఉంటాయి. రీ రిజిస్ట్రేషన్‌కు వాహనం ఆధారంగా రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే తక్కువగా కొనుగోలు చేసిన వ్యాపారులు ఎవరికో ఒకరికి అంటగడుతున్నారు. ఈ రీతిలో ఎలాంటి పత్రాల్లేని వాటిని తీసుకొచ్చి జిల్లాలో అమ్మకాలు సాగిస్తున్నారని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రోజుకు 10 నుంచి 20 వరకు బండ్లను అమ్ముతున్నట్లు తెలిసింది.

చోద్యం చూస్తూ..

జిల్లాలో ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు పెద్దఎత్తున యథేచ్ఛగా తిరుగుతున్నా రవాణా శాఖ చోద్యం చూస్తోందనే ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి పన్ను చెల్లించని వాహనాలపై పోలీస్‌, ప్రెస్‌, రాజకీయ నేతల పేర్లు రాసి తిప్పుతున్నారని అధికారులే చెబుతున్నారు. పైగా పూర్తి స్థాయిలో బ్లాక్‌ ఫిల్మ్‌ వేస్తున్నారు. ఇక్కడ ఆ బండ్లు నెలల తరబడి ఎందుకు తిరుగుతున్నాయి?, వాటిలో ఎవరు తిరుగుతున్నారన్న దానిపై విచారణ కూడా ఉండటం లేదు. ఇటీవల నేర సంస్కృతి బాగా పెరిగింది. వేరే స్టేట్‌ల వాహనాలు ఇక్కడ తిప్పుతున్నా రవాణా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కొంతమందికి సెకండ్‌ హ్యాండ్‌ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. పోలీసు, రవాణా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వ్యాపారం మూడు కార్లు ఆరు బస్సులుగా వెలుగొందుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చిన వాహనాలకు ఎలాంటి పన్నులు చెల్లించకుండా యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. తనిఖీలు లేకపోవడంతో తక్కువ ధరకు వస్తుందని కొందరు వాహనాన్ని కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారు. పన్ను చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు.

రిజిస్ట్రేషన్లు చేసుకోకుండానే

సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల అమ్మకాలు

జిల్లా వ్యాప్తంగా 100కు పైగా సంస్థల ఏర్పాటు

ఇతర రాష్ట్రాల నుంచి కార్లు తీసుకొస్తున్న వైనం

ఒరిజినల్‌ పత్రాల్లేకుండానే కొన్ని జిల్లాకు..

పన్ను చెల్లించకుండానే తిప్పుతూ..

చోద్యం చూస్తున్న రవాణా అధికారులు

నిఘా పెట్టాం

పన్ను చెల్లించకుండా జిల్లాలో తిరుగుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. తనిఖీలు చేసి పన్ను చెల్లించని, పత్రాల్లేని వాహనాలను సీజ్‌ చేయాలని చెప్పాం. ఏపీలో నెలకంటే ఎక్కువ రోజులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు తిరగకూడదు. అదే విధంగా తెల్ల నంబర్‌ ప్లేట్‌ బోర్డు ఉన్న వాహనాలను అద్దెకు తిప్పుకూడదు. ప్యాసింజర్లను ఎక్కించకూడదు. వీటిపై కూడా తనిఖీలు చేపట్టి సీజ్‌ చేస్తాం.

– ఎండీ మదానీ, ఇన్‌చార్జి డీటీసీ

అడిగేదెవరు.. ఆపేదెవరు!1
1/2

అడిగేదెవరు.. ఆపేదెవరు!

అడిగేదెవరు.. ఆపేదెవరు!2
2/2

అడిగేదెవరు.. ఆపేదెవరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement