
శివలింగం చోరీ కేసులో నిందితుల అరెస్ట్
అల్లూరు: శివలింగం చోరీ చేసిన ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. అల్లూరు మండలం నార్త్ ఆములూరు గొల్లపాళెం సమీపంలోని పాత శివాలయం వద్దకు ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి కోవూరుకు చెందిన ఉమ్మడిశెట్టి హరికృష్ణ, షేక్ వాజిద్‌అహ్మద్, పాండిచేరి కుమార్, పడుగుపాడుకు చెందిన యాటగిరి శ్రీనివాసులు, అనంతపురానికి చెందిన శ్రీనివాసులు మినీవ్యాన్‌లో వెళ్లారు. శివలింగాన్ని గడ్డపారతో తవ్వి వాహనంలో తీసుకెళ్లారు. పక్కరోజు రాత్రి కోవూరు గ్రామ శివారు ప్రాంతంలో శివలింగాన్ని పగులగొట్టగా అది 52 ముక్కలైంది. అందులో నాలుగు రాగి నాణేలు దొరకడంతో వాటిని పంచుకుని వెళ్లిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిని రిమాండ్‌కు పంపడం జరిగిందని ఎస్సై తెలిపారు.
గంజాయి కేసులో
మరో వ్యక్తి అరెస్ట్
● ఆరు కేజీల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయ కేసులో మరో వ్యక్తిని మంగళవారం సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. కపాడిపాళేనికి చెందిన సుభానీ, సిరాజ్ దంపతులు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి నెల్లూరులో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగారు. వారి కదలికలపై నిఘా ఉంచిన సంతపేట పోలీసులు ఈనెల 24వ తేదీన దాడి చేశారు. సుభాని, సిరాజ్, గంజాయి విక్రయాలకు తరలిస్తున్న జ్యోతి, మీరాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు సుభానీ దంపతులను విచారించగా ఉస్మాన్‌సాహెబ్‌పేట రామ్‌నగర్‌కు చెందిన రామకృష్ణ సైతం తమవద్ద గంజాయి తీసుకుని విక్రయిస్తుంటాడని వెల్లడించారు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు.