కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్‌ | - | Sakshi
Sakshi News home page

కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్‌

Aug 27 2025 8:19 AM | Updated on Aug 27 2025 8:19 AM

కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్‌

కాకాణీ.. కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్‌

ఆ రోజు అసలేం జరిగింది..

త్వరలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా జైలుకు పంపుతాము

ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి పైనా

అనుచిత వ్యాఖ్యలు

టీడీపీ కావలి ఎమ్మెల్యే

కావ్య కృష్ణారెడ్డి

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రాజకీయ ప్రత్యర్థిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఫ్రస్ట్రేషన్‌ పతాక స్థాయికి చేరింది. శాసనసభ్యుడిననే స్థాయి మరిచిపోయి వీధిరౌడీలా బహిరంగ వేదికలపై పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. నీ ఇంటికి వస్తా.. నీ అంతు చూస్తా అంటూ చెలరేగిపోయారు. జలదంకి మండలం అన్నవరంలో అక్రమ మైనింగ్‌తోపాటు కావలిలో జరిగిన మనీ స్కీమ్‌ స్కామ్‌లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాత్రను వెలికి తీస్తానని ప్రతిగా స్పందించిన ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ‘కత్తి’ కుట్రలు, ‘కుల’ కుతంత్రాలకు తెరతీశారు. క్వారీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను బహిర్గతం చేయడానికి సోషల్‌ మీడియా యాక్టివిస్టులు వేణు, శ్రావణ్‌కుమార్‌, వినోద్‌ వీడియోలు, ఫొటోలు తీసేందుకు వెళ్లిన ఉదంతాన్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు తీసుకెళ్లారు.

తనను హత్య చేయడానికే వచ్చారంటూ..

ఈ ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సినిమా కథను తలపించే రీతిలో కొత్త కథను అల్లారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులను రౌడీలుగా చిత్రీకరించారు. వారిని చెట్టుకు కట్టేసి, చిత్రహింసలు పెట్టించారు. వారి చేతుల్లోని కెమెరాలను పక్కన పెట్టించి.. కత్తులు చేతుల్లో పెట్టి తనను హత్య చేయించడానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పంపించారంటూ కట్టు కథ చెప్పించారు. ఈ మేరకు ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టించారు. తాజాగా హత్యాయత్నం కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్లను చేర్చేందుకు పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయడం చూస్తే కక్ష సాధింపు చర్యలు తీవ్ర రూపం దాల్చాయని స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దాష్టీకాలపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా కావలిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్వారీలో అక్రమ మైనింగ్‌ బట్టబయలు చేసేందుకు ‘చలో అన్నవరం’ కార్యక్రమాన్ని చేపడుతామని ప్రకటించిన తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణారెడ్డి మరింత ఫ్రస్ట్రేషన్‌తో కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కావలిలో అడుగు పెడితే ఖబడ్దార్‌ అంటూ ఊగిపోయారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అవమానించే రీతిలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని త్వరలోనే జైలుకు పంపిస్తానంటూ శపథం చేస్తూ రెచ్చిపోయిన తీరు చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు.

పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిళ్లు

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై కక్ష సాధింపు తీవ్రరూపం

తాజాగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైన వైనం

ఎనిమిది రోజుల

కిందట హత్యాయత్నం

ఎస్సీ, ఎస్టీ సెక్షన్‌ చేర్చాలంటూ కోర్టులో మెమో దాఖలు

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి జలదంకి మండలం అన్నవరంలో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. క్వారీలో అక్రమ మైనింగ్‌ దందాను బయట పెట్టేందుకు ఈ నెల 19న కావలికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్టు వేణు, అన్నవరానికి చెందిన శ్రావణ్‌కుమార్‌, అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన వినోద్‌ వీడియోలు, ఫొటోలు తీస్తుండగా క్వారీ సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. శ్రావణ్‌కుమార్‌ పరారీ కాగా, మిగతా ఇద్దరు చిక్కారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి క్వారీ సూపర్‌వైజర్‌ ఏడుకొండల ద్వారా ఆ ముగ్గురు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ముఖ్య అనుచరులని, ఆయన సూచనల మేరకే తమను, ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపేందుకు వచ్చారంటూ జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చి తనపై మాజీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర చేశారంటూ మాట్లాడారు.

నెల్లూరు సిటీ: కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇంకోసారి కావలిలో అడుగు పెట్టావో ఖబడ్దార్‌ అంటూ టీడీపీ కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. నగరంలోని వీపీఆర్‌ విల్లాస్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి ఆడంగి లక్షణాలు ఉండే నువ్వా మాట్లాడేది.. కావ్య అంటే పౌరు షం.. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్‌రెడ్డి.. మీరేంటి నన్ను పీకేది’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి ప్రజలిచ్చిన తీర్పును అవమానించారన్నారు. 2007 నుంచే చిన్న కుటీర పరిశ్రమగా క్వారీని నిర్వహిస్తున్నామన్నారు. తనకు కావలి టికెట్‌ ఇచ్చిన క్రమంలో టీడీపీకి రూ.కోట్ల చందా ఇచ్చానంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపణలు చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఇతర జిల్లాల నుంచి అధికారులతో క్వారీలో తనిఖీలు చేయించారన్నారు. రూ.143 కోట్లు పెనాల్టీ వేశారన్నారు. తాను అవినీతి, అక్రమాలు చేసి ఉంటే ఏ గుడికై నా, ఎక్కడికై నా వస్తానని తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లను కత్తులతో క్వారీలోకి పంపించి డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. తాను అడ్డొస్తే హతమార్చమని ప్రతాప్‌కుమార్‌రెడ్డి రౌడీ షీటర్లకు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఫోన్‌ చేశారని ఆరోపించారు. త్వరలో ప్రతాప్‌కుమార్‌రెడ్డిని కూడా జైలుకు పంపడం ఖాయమన్నారు.

వాస్తవాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి వేణు, శ్రావణ్‌కుమార్‌, వినోద్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, రాజేష్‌పై ఆగమేఘాల మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇంకొందరి ప్రమేయం ఉందని కేసులో పొందుపరిచారు. ఆ కేసులో మరుసటి రోజు వేణు, వినోద్‌లను అరెస్ట్‌ చేశారు. ఫిర్యాదుదారుడు ఏడుకొండలు ఎస్సీ కావడంతో ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ సెక్షన్‌ను చేర్చాలంటూ ఈ నెల 23న జలదంకి పోలీసులు కావలిలోని అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ కోర్టులో మెమో దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను చేరుస్తున్నారు. వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు పోలీసు అధికారులు ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడంపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement