
శ్రీకాంత్, అరుణ కేసుల్లో లోతైన విచారణ
సాక్షి టాస్క్‌ఫోర్స్: రౌడీషీటర్ శ్రీకాంత్, అరుణ విషయంలో పోలీసులు విభిన్న కోణాల్లో లోతైన విచారణ చేపడుతున్నారు. జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు అసలు అరుణ ఎలా పరిచయమైంది? ఆమె ఎన్నిసార్లు ములాఖత్ ద్వారా శ్రీకాంత్‌ను ఒంటరిగా, ఎవరెవరితో ఏఏ తేదీల్లో కలిసింది?.. ఆ తర్వాత జిల్లాలో ఏమైనా నేరాలు జరిగాయా? ఆ కేసుల్లోని నిందితులు ములాఖత్‌లో శ్రీకాంత్‌ను కలిసిన వారిలో ఉన్నారా? ఇలా అన్నీ కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలు, హోంమంత్రి మెడకు చుట్టుకుంటున్న నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వ పెద్దల విషయాలు బయటకు వస్తాయోనని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీస్‌బాస్‌లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేరుగా రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సుమారు 16 నెలల కిందట ఆమె శ్రీకాంత్‌ను కలిసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అప్పటి నుంచి జిల్లాలో జరిగిన పలు హత్యల కేసుల్లోని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని మరోమారు విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులకు వారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే వివరాలను రాబట్టుతున్నారు. మరో వైపు జిల్లాలో ఉన్న టాప్ 10 రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు రౌడీషీటర్లను గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కొంతమంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వారిని సైతం నేడో, రేపో అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. పోలీసుల చర్యలతో అనేక మంది ఊర్లు విడిచి పారిపోయారు. కొంత కాలంగా జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై రేంజ్ ఐజీ మంగళవారం రాత్రి ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించినటు్‌ల్ తెలిసింది. శ్రీకాంత్, అరుణ వ్యవహారానికి సంబంధించిన అన్నీ వివరాలతోపాటు, రౌడీషీటర్లు ఎంత మంది ఉన్నారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే తదితర వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.