
‘మహా గణపతిం మనసా స్మరామి’
విఘ్ననాశకుడైన మహా గణపతి ఆవాహనకు సమయం ఆసన్నమైంది. వేదోక్త మంత్ర ధ్వనులతో పులకరించే గడియలు సమీపించాయి. ప్రతి వీధి, ప్రతి ఇంట్లో గణనాథుని విగ్రహ ప్రతిష్టతో పవిత్రత విరజల్లుతోంది. బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవాల వాతావరణంతో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతోంది. ‘మహా గణపతిం మనసా స్మరామి’ అంటూ గృహాలు, వీధులు భక్తి హారతులు, వేదోక్త మంత్రోచ్ఛారణలతో శోభితంగా మారుతోంది. కుంకుమ, గంధం, పుష్పాలతో ప్రతి ఇంట్లో గణనాథుడిని పూజించేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ సిద్ధమవుతున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలు, పూజా పత్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో కొలువైన గణనాథుడు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్త మండళ్లు ప్రతిష్టాత్మకంగా మండపాలను న భూతో న భవిష్యతి రీతిలో విద్యుద్దీపాలు, ఆధ్యాత్మిక, ప్రకృతి ఒడిలో గణనాథుడి కొలువైనట్లుగా అలంకరించారు.

‘మహా గణపతిం మనసా స్మరామి’