
పర్యావరణహితంగా వినాయకచవితిని జరుపుకోండి
నెల్లూరురూరల్: వినాయకచవితి పర్వదినాన్ని ప్రజలందరూ ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు మాని మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి, పర్యావరణ ఇంజినీర్ ఎన్.అశోక్‌కుమార్ తెలిపారు. 3000 మట్టి ప్రతిమలను తయారు చేయించి ఉచితంగా ప్రజలకు అందించేందుకు మంగళవారం ఫత్తేఖాన్‌పేట రైతుబజారు దగ్గర స్టాల్‌ను ఏర్పాటు చేశారు. నెల్లూరు ఆర్డీఓ అనూష మట్టి వినాయక ప్రతిమలను పంపిణీని ప్రారంభించారు. ఆర్డీఓ మాట్లాడుతూ రసాయనాలు, రంగులు, పర్యావరణనాన్ని కలుషితం చేస్తాయన్నారు. వీటి వల్ల మనుషులకే జలచరాలకు కూడా హాని కలుగుతుందన్నారు. వినాయక విగ్రహాల అలంకరణకు పూజ సామగ్రిలోనూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన కళాజాత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది, ప్రజలు, డీకేడబ్ల్యూ కళాశాలకు చెందిన రజని ఆధ్వర్యంలో ఏపీ కలైమెట్ యాక్షన్ గ్రూపు వలంటీర్లు, కళాజాత బృంద సభ్యులు పాల్గొన్నారు.