
నెల్లూరులో కార్డన్ సెర్చ్
● 120 వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాలతో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియ పర్యవేక్షణలో పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ చేపట్టారు. చిన్నబజారు పోలీసుస్టేషన్ పరిధిలోని రాజీవ్‌గృహకల్ప, నవాబుపేట పరిధిలోని ఉడ్‌హౌస్ సంఘం, సంతపేట పరిధిలోని కపాడిపాళెం, దర్గామిట్ట పరిధిలోని ప్రగతినగర్, వేదాయపాళెం పరిధిలోని వైఎస్సార్ నగర్, బాలాజీనగర్ పరిధిలోని వెలగచెట్టు సంఘంలో ఏకకాలంలో తనిఖీలు జరిగాయి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరాతీశారు. వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేని 113 మోటార్‌బైక్‌లు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. రౌడీషీటర్ల ఆగడాలు, ఈవ్‌టీజింగ్ తదితరాలను గుర్తిస్తే స్థానిక పోలీసులకు, డయల్ 112కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నేరనియంత్రణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. తనిఖీల్లో నగర ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, జి.దశరథరామారావు, ఎం.రోశయ్య, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులో కార్డన్ సెర్చ్