
పైసలిస్తేనే పరుగు
గత వారంలో మర్రిపాడు మండలం అనంతపురం గ్రామానికి చెందిన ఓ నిరుపేద గర్భిణి కాన్పు కోసం నెల్లూరు పెద్దాస్పత్రిలో చేరింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం డాక్టర్లు ఆమెను డిశ్చార్జి చేశారు. తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఉచితంగా వెళ్లాలని సంబంధిత డాక్టర్ ఆమెకు చెప్పారు. దీంతో ఆమె తన తల్లితో కలిసి పసిబిడ్డను ఎత్తుకుని హాస్పిటల్ ఆవరణలో ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం వద్దకు చేరింది. దీంతో వాహన డ్రైవర్ శ్రీను అంతదూరం రామన్నారు. రూ 3 వేలిస్తే వస్తామని, చివరకు రూ.2,500 ఇస్తే వాహనంలో ఇంటికి చేరుస్తానన్నాడు. బయట ప్రైవేట్ వాహనం అయితే రూ.6 వేలు చెప్పడంతో విధి లేక ఆ డబ్బులిచ్చి ఇంటికి వెళ్లారు. గ్రామానికి వెళ్లాక ఆమె బంధువులు 102 తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు డబ్బులిచ్చేటప్పుడు వీడియో తీశారు. ఈ విషయం మరో మారు చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఒక్క పెద్దాస్పత్రిలోనే కాదు జిల్లాలోని ఇతర ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి.
● ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులకు వచ్చేది పూటగడవని మహిళలే
● ఉచితంగా ఇంటి వద్ద
దించాల్సిన సిబ్బంది నగదు డిమాండ్
● దూరాన్ని బట్టి రూ.2 వేల నుంచి
3 వేల వరకు గుంజుతున్న డ్రైవర్లు
● అధికారుల పర్యవేక్షణ శూన్యం..
పక్కదారి పట్టిన పథకం
పట్టుబడిన నిందితులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది
డబ్బు తీసుకున్న వారిపై
కఠిన చర్యలు
102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా కాన్పు జరిగిన మహిళలను ఉచితంగా ఇంటి వద్ద వదిలి రావాలి. డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల రూ. 2,500 వసూలు చేసిన డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాం. ఈ మేరకు నోటీసుకూడా ఇచ్చాం. ఎవరై నా డ్రైవర్లు లంచం అడిగితే మా దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ సుజాత, డీఎంహెచ్‌ఓ
నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు జరిగిన తల్లి, బిడ్డతోపాటు సహాయకులను క్షేమంగా ఉచితంగా ఇంటికి చేర్చేందుకు 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో అరబిందో ఏజెన్సీ ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్ పొందింది. ఈ ఏజెన్సీ నియమించిన డ్రైవర్లు తల్లి,బిడ్డను వాహనం ద్వారా ఇంటి వద్ద దించి రావాలి. జిల్లాలో నెల్లూరు నగరంలోని పెద్దాస్పత్రి ఎంసీహెచ్ బ్లాక్ వద్ద 8 వాహనాలు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో 3 వాహనాలు, కావలి ఏరి యా ఆస్పత్రిలో 2, కోవూరులో 2, ఉలవపాడులో 1, కందుకూరులో 1, పొదలకూరులో 1, ఉదయగిరిలో 1 వాహనాలున్నాయి. వీటి ద్వారా కాన్పు జరిగిన తల్లి బిడ్డలను ఇంటికి చేర్చుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెరిగిన వాహనాలు
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో 10 వాహనాలు మాత్రమే ఉండేవి. దీంతో వాహనాలు చాలక కాన్పు జరిగిన మహిళలు ఇబ్బంది పడేవారు. కాన్పు జరిగిన వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు డిశ్చార్జి అయ్యాక ఆ ఇద్దరు మహిళలు, ఇద్దరు చంటి బిడ్డలు, సహాయకులు వాహనంలో ఎక్కేందుకు స్థలం ఉండేది కాదు. ఇరుకుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేసేవారు. ఒకరిని ఒక గ్రామంలో వదిలి పెట్టాక మరొకరు తమ గ్రామం వచ్చే వరకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక ఈ ఇబ్బందులను గమనించి వాహనాల సంఖ్యను 19 వరకు పెంచింది. తల్లీబిడ్డతోపాటు సహాయకురాలిని మాత్రమే వాహనంలో ఎక్కించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇబ్బందులు తగ్గాయి.
పర్యవేక్షణ లేక లంచాలు
తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు డీఎంహెచ్‌ఓ పరిధిలో ఉంటాయి. అరబిందో ఏజెన్సీ ప్రతినిధి, డీఎంహెచ్‌ఓ కంట్రోల్‌లో పని చేయాలి. డీఎంహెచ్‌ఓ వివిధ ఆస్పత్రులకు వాహనాలు కేటాయించాక ఆయా ఆస్పత్రిల సూపరింటెండెంట్లు అక్కడ పర్యవేక్షించాలి. అయితే ఇక్కడ పర్యవేక్షణ కరువైంది. ఉదాహరణకు పెద్దాస్పత్రిలో 8 వాహనాలుండగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ అధి కారిని 102 వాహనాల గురించి అడగగా డీఎంహెచ్‌ఓ కంట్రోల్‌లో ఉన్నాయి. తమకు సంబంధం లేదన్నట్లు సమాధానం ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ కూడా ఇప్పటి వరకు వీటి గురించి పట్టించుకోలేదు. ఏ రోజు ఏ వాహనం ఎక్కడికి వెళ్లింది.. సమయం, కాన్పు జరిగిన మహిళ పేరు, డ్రైవర్ పేరు ఇలాంటి వివరాలు నమోదు చేసే రికార్డులు పెద్దాస్పత్రిలో కూడా లేవు. ఇంత నిర్లక్ష్యం ఉండటంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా పేద రోగుల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. అడిగే నాథుడే లేకపోవడంతో డ్రైవర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా తయారైంది. రోజుకు ఒక్కో డ్రైవర్ కనీసం రూ.1000 సంపాదిస్తారు. ఈలెక్కన నెలకు రూ.30 వేలు అదనంగా రోగుల వద్ద నుంచి లాక్కుంటున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులకు కాన్పు కోసం వచ్చే నిరుపేద మహిళల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ లంచాలిస్తేనే పరుగులు పెడుతోంది. అడిగినంత ఇస్తేనే ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ఇవ్వలేమంటే వాహనం మరమ్మతులకు గురైందని, రాలేమంటూ తప్పించుకుంటున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన ఏజెన్సీ ప్రతినిధులు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవడంతో డ్రైవర్లు ఆడిండే ఆట, పాడిందే పాటగా సాగిపోతోంది.