
రూ.200 దొంగనోటు కలకలం
ఆత్మకూరు: పట్టణంలోని మున్సిపల్ మార్కెట్‌లో ఆదివారం రూ.200 దొంగనోటు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేసి రూ.200 నోటు ఇచ్చాడని, ఆ దుకాణాదారుడు మామూలుగానే తీసుకుని అతనికి మిగిలిన చిల్లరను ఇచ్చి పంపించాడు. మధ్యాహ్నం తన దగ్గర ఉన్న నగదును మరొకరికి ఇచ్చే క్రమంలో ఈ రూ.200 నోటు దొంగనోటుగా అవతల వ్యక్తి గుర్తించాడు. దీంతో పలువురికి చూపించగా దొంగనోటు అని నిర్ధారణ అయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా, ఇకపై దుకాణాదారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వారిని గుర్తించి తమకు తెలియజేయాలని ఆత్మకూరు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల మర్రిపాడు మండలంలో మద్యం దుకాణానికి సైతం రూ.200 నకిలీ నోటు వెలుగులోకి రావడంతో కలకలం రేగిన విషయం విదితమే. తాజాగా ఆత్మకూరులోనూ ఆ తరహాలో రూ.200 నకిలీ నోటు రావడంతో రూ.200 నోట్లు తీసుకోవడానికి వ్యాపారులే కాకుండా.. ప్రజలు సైతం భయపడుతున్నారు. దీన్ని బట్టి ఆత్మకూరు పరిసరాల్లోనే రూ.200 నకిలీ నోట్ల తయారు చేసి చెలామణి చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.