
కండలేరుపైనే ఆశలు
● సోమశిల నుంచి జోరుగా వరద నీరు
● ఈ సీజన్‌కు ఢోకా లేదు
●
సైదాపురం: నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు జలాశయంలోకి రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతోంది. దీంతో నాన్ డెల్టా రైతుల్లో ఆశలు మరింత చిగురిస్తున్నాయి. కండలేరులో ఇప్పటికే 30 టీఎంసీల నీటి నిల్వలు ఉండటంతో ఈ సీజన్ సాగుకు ఢోకా లేదని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాతోపాటు తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరును విడుదల చేశారు.
పెరుగుతున్న వరద
కండలేరు 30 టీఎంసీలకు చేరింది. దీనికితోడు రోజూ సోమశిల జలాశయం నుంచి 9400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సెప్టెంబర్ నెలాఖరుకు 50 టీఎంసీలు నీరు చేరు అవకాశం ఉందని అధికారులతోపాటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కండలేరులో పుష్కలంగా నీరు ఉండటంతో ఆయకట్టు రైతులకు రబీపై మరింత భరోసా కలిగింది.
ఆగస్టులో డెడ్ స్టోరేజ్
ఆగస్టు నెలలో కండలేరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సోమశిల జలాశయం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం నీటి నిల్వ పెరుగుతోంది. ప్రధానంగా సర్వేపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు నియోజకవర్గాలకు చెందిన రైతులు కండలేరు నుంచి వచ్చే నీటిని ఆధారం చేసుకుని రబీ పంటలు సాగు చేస్తున్నారు.
చెరువులకు సాగునీరు
కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,600 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 30, లోలెవల్ కాలువకు 20 క్యూసెక్కులు, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో చెరువులకు సాగునీరందే అవకాశం ఉంది. ఈ జలాశయం పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు.