
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘కూటమి ప్రభుత్వంలో మహిళల పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. వారికి రక్షణ కరువైంది. రాష్ట్రంలో మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచిందన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వారికి పదవులు ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు మరోలా ఉన్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. 5జీ ఫోన్లు ఇవ్వలేక సొంత ఖర్చులతో పనిచేయమని చెప్పడం దారుణమన్నారు. మహిళల సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.
జగనన్నకు కృతజ్ఞతలు
నియోజకవర్గ స్థాయిలో పనిచేసే తనను మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పూజిత కృతజ్ఞతలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. తన తండ్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలుకు వెళ్లి 75 రోజులైందన్నారు. ఆయన బయటకు వస్తారని ప్రతిరోజూ అనుకుంటున్నామన్నారు. కేసులపై కేసులు వేసి తమను మానసికంగా వేధిస్తున్నప్పుడు జగనన్న ఫోన్‌లో మాట్లాడి ఓదార్చడమే కాకుండా నెల్లూరుకు వచ్చి నాన్నను కలిసి ధైర్యం చెప్పారని, ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు కాకాణికి అండగా ఉన్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎంబేటి శేషమ్మ, ఆత్మకూరు మహిళా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ ప్రసన్న, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షురాలు సంధ్యారాణి, నెల్లూరు రూరల్ అధ్యక్షురాలు రమాదేవి, నెల్లూరు సిటీ అధ్యక్షురాలు ధనుజారెడ్డి, ఇంకా శారద, బషీరా, ముంతాజ్, హైమ, వసంత తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత