
కన్నపేగు విలవిల
● కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
నెల్లూరు(క్రైమ్): చదువుల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనుకున్న కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నపేగు విలవిల్లాడింది. కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలిపోయారు. వారి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకు హేమశ్రీ (16), మరో కుమార్తె, కుమారుడు సంతానం. తిరుమలయ్య శ్రీసిటీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నతంలోనే పిల్లలను చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా హేమశ్రీ చిన్నతనం నుంచే చదువుల్లో చురుకుగా ఉండేది. పదో తరగతిలో 550 మార్కులు సాధించింది మండల టాపర్‌గా నిలిచింది. కుమార్తె మంచి మార్కులు సాధించడంతో భవిష్యత్‌లో మరింతగా చదువుల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉంటుందని తల్లిదండ్రులు కలలుగన్నారు. ఆమెను నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్‌ఎన్‌ఆర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కొంతకాలంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతూ ఉండేది. తల్లిదండ్రులు ఆదివారం కళాశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడతామని చెప్పారు. ఈక్రమంలోనే హేమశ్రీ మృతిచెందింది. నెల్లూరుకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతిని తట్టుకోలేక రోదిస్తూ కుప్పకూలిపోవడం చూపరులను సైతం కంట తడిపెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుమార్తెను కళాశాల వారే పొట్టన పెట్టుకున్నారని వారు ఆరోపించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతి వెనుక అనుమానాలున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.