ప్రజలకు ఇబ్బంది లేకుండా..
● పెనుశిల అభయారణ్య ఎకో సెన్సిటివ్ జోన్‌కు ప్రణాళిక
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(అర్బన్): స్థానికంగా ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా పెనుశిల నరసింహ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆనంద్ అటవీ శాఖ అధికారులు, సంబంధిత స్టేక్ హోల్డర్లకు సూచించారు. గురువారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో ఎకో సెన్సిటివ్ జోన్, జిల్లాలోని చిత్తడినేలను నోటిఫై చేసే అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్‌బాషా వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. కేరళలోని తిరువంతపురం నుంచి వచ్చిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ జోన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ అభయారణ్యంలో మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన నిబంధనలు, నిషేధించాల్సిన అంశాల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్లాన్‌లోని అంశాలను ఎకో సెన్సిటివ్ జోన్‌లో నివసించే ప్రజలకు వివరించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి పరిధిలో ఎన్నుకోబడిన చిత్తడి నేలలను నోటిఫై చేసి వాటిని పరిరక్షించేందుకు ఎలాంటి అభ్యంతరాలున్నా శుక్రవారం సాయంత్రంలోపు తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులు లేకపోతే 5 నోటిఫికేషన్లను రాష్ట్ర స్థాయి వెబ్‌ల్యాండ్ అథారిటికీ పంపుతామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ శరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవతి, ఆర్‌అండ్‌బీ డీఈఈ రంగయ్య, మత్స్యశాఖ జేడీ శాంతి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, నెల్లూరు, రాపూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి రేంజ్ ఆఫీసర్లు మాల్యాద్రి, రవీంద్రబాబు, కుమార్‌రాజా, శేఖర్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


