నెల్లూరు(టౌన్): టీచర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. పరీక్ష వాయిదాపై వారికి కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో అభ్యర్థులు రూ.వేలు ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి ఇబ్బందులు పడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీ కోసం అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష వాయిదాపై తమకు ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులను అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. శుక్రవారం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు అభ్యర్థులు నెల్లూరు పొట్టేపాళెంలో పరీక్ష కేంద్రమైన అయాన్ డిజిటల్ ఎదుట తమ హాల్‌టికెట్లతో నిరసన వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వకుండా..
కస్తూరిదేవి బాలికల ఉన్నత పాఠశాల, గూడూరులోని శ్రీపొట్టి శ్రీరాములు ప్రాథమిక ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం సుమారు 1,600 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. శుక్ర, శనివారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపారు. ఆ శాఖ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అయితే పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహణపై ఆయా ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో పరీక్ష నిర్వహణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయంపై అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వాయిదాపై పత్రికా ప్రకటనలు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో ఉంటున్న అభ్యర్థులకు వాయిదా విషయం తెలియకపోవడంతో నెల్లూరులోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి సిబ్బంది వారిని లోనికి పంపకపోవడంతో ఆందోళనతో జిల్లా విద్యాశాఖాధికారులను ఫోన్‌లో సంప్రదించారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
పరీక్ష వాయిదాపై సమాచారం ఇవ్వని విద్యాశాఖ
సుదూర ప్రాంతాల నుంచి రాక
వాయిదా పడిందని తెలుసుకుని
నిరసన తెలిపిన వైనం
ఆశగా ఎదురు చూశాం
పరీక్షలు జరిగి ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందనే ఆశతో ఎదురు చూశాం. ఎంతో దూరం నుంచి ఇబ్బంది పడుతూ నెల్లూరుకు వచ్చాం. ఇక్కడ పరీక్షను నిర్వహించలేదు. అధికారుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం తగదు.
టి.మేరీ, ప్రకాశం జిల్లా
అభ్యర్థులతో అధికారుల ఆటలు


