రారని తెలిసినా.. వచ్చేస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం..

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాక్షేత్రంలో వైఎస్సార్‌సీపీతో పోటీ పడలేక టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారానికి తెరతీసింది. వారికి ఎల్లో మీడియా తోడైంది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని వీడుతున్నారంటూ రెండురోజులుగా ప్రచారం చేస్తోంది. దీనిని ఆ ఇద్దరూ ఖండించారు.

కొత్తవారి కోసం..
టీడీపీ కొంతకాలంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తోంది. మాజీలకు టికెట్లు ఇస్తే గెలుపు కష్టమని రిపోర్టులు తేటతెల్లం చేశాయి. దీనికితోడు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారు. దీంతో కొత్త ముఖాల కోసం వేట సాగిస్తున్న టీడీపీ అధిష్టానం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. అయితే ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఈదఫా టికెట్లు ఇవ్వనని ఏడాదిన్నర ముందే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెగేసి చెప్పారు. ఈ క్రమంలో టికెట్‌పై ఆశలు వదలుకున్న కొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోడ దూకారు. వారిపై వైఎస్సార్‌సీపీ అధిష్టానం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ సోషల్‌ మీడియా వేదికగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై మైండ్‌గేమ్‌కు తెరలేపింది.

వైఎస్‌ కుటుంబానికి విధేయుడు
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. వైఎస్సార్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ఓదార్పు యాత్ర నుంచి వెన్నంటి ఉన్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. రాజకీయ విలువలున్న కుటుంబం నుంచి వచ్చిన ప్రసన్న ఇప్పటికి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సొంతం చేసుకున్నారు. ఆయన పార్టీ వీడతున్నాడంటూ తెలుగుతమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రసన్న అభి మానులు మండిపడుతున్నారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెట్టారు. టీడీపీ తప్పుడు ప్రచారంపై ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ వెంటే..
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి వైఎస్‌ కుటుంబానికి ఎంతో దగ్గరగా ఉన్నారు. వైఎస్‌ మరణానంతరం జరిగిన పరిణామాలతో మేకపాటి కుటుంబం జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. అలాంటి వారిపై టీడీపీ సోషల్‌ మీడియా, తెలుగు తమ్ముళ్లు దుష్ప్రచారానికి దిగారు. దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డితో జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయ స్నేహబంధం ఉండేది. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డితో స్నేహం ఉంది. కాగా పచ్చదండు కుట్ర పన్ని చేస్తున్న విష ప్రచారాన్ని విక్రమ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top