జీవీకే హంతకులకు యావజ్జీవం

Life imprisonment for wife son and three others in doctors murder case - Sakshi

నెల్లూరు(అర్బన్‌): గుడుగుంట విజయ్‌కుమార్‌.. డాక్టర్‌ జీవీకేగా జిల్లా ప్రజలకు సుపరిచితుడు. ఓ వైపు వైద్యుడిగా పేద ప్రజలకు సేవలందిస్తూనే మరో వైపు సామాజిక ఉద్యమాలు నడిపారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కన్వీనర్‌గా.. సారా వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్‌గా పనిచేశారు. అక్షరాస్యత ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మంచి వ్యక్తిగా ప్రజల్లో పేరు సంపాదించారు. అయితే కుటుంబసభ్యులే ఆయన పాలిట శాపంగా మారారు. ఆస్తి కోసం కట్టుకున్న భార్య, కన్న బిడ్డ కిరాయి హంతకులతో కలిసి సభ్య సమాజం తలదించుకునేలా ఆయన్ను హత్య చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం రేపింది. నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి సత్యవాణి శుక్రవారం ఈ కేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం పలు కుటుంబాలను వీధులపాలు చేసింది. కాగా ఇటీవల కాలంలో జిల్లా పరిధిలో ఒకే దఫా ఐదుగురికి యావజ్జీవ శిక్షలు పడిన సంఘటనల్లేవు.

ప్రేమ ఏమైంది?
డాక్టర్‌ విజయ్‌కుమార్‌, కావలికి చెందిన ఉషారాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ విద్యావంతులే. మొదట్లో ఒకరికొకరు తోడు అన్న చందంగా ఉన్నారు. అనేక ఉద్యమాల్లో కలిసి చురుగ్గా పనిచేసిన వారే. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఒకరు సుందరయ్య, మరొకరు కుమార్తె లెనీనా. అయితే వారి మధ్య ఏమైందో కానీ అనుమానం అనే పెనుభూతం వెంటాడింది. భార్యాభర్తలకు పొసగలేదు. బిడ్డలు చిన్న వయసులో ఉండగానే విజయ్‌కుమార్‌ తన తల్లితో కలిసి వేదాయపాళెంలో ఉండేవారు. భర్తపై ఉషారాణి పగ పెంచుకుంది. బిడ్డలు సైతం తండ్రిపై కోపంగా ఉండేలా చేసింది.

నగదు పంపించినా..
పిల్లలు పెద్దవారయ్యారు. వారు తల్లి వద్దే ఉన్నప్పటికీ చదువులకు విజయ్‌కుమార్‌ నగదు పంపించేవారు. విజయ్‌కుమార్‌ రెడ్‌క్రాస్‌ కార్యాలయం పక్కన ఐదంతస్తుల అధునాతన హాస్పిటల్‌ను నిర్మించారు. రోగుల సంఖ్య పెరిగింది. సంపాదిస్తున్న సొమ్ముంతా తన కుటుంబానికి ఇవ్వడం లేదని భార్య లోలోపల రగిలిపోసాగింది. అప్పుడప్పుడు కుమారుడు తండ్రి వద్దకు వెళ్లి గొడవ పెట్టుకునేవాడు.

ప్రాణం మీదకు తెచ్చిన ఆస్తి
పోలీసుల చార్జిషీట్‌ మేరకు విజయ్‌కుమార్‌ నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశ ఉషారాణికి కలిగింది. ఈ నేపథ్యంలో ఆమె తన బిడ్డను రెచ్చగొట్టింది. తండ్రి సంపాదించిన ఆస్తి వేరే వారికి ఖర్చు పెడుతున్నాడని అతడిలో విషం నింపింది. ఆస్తి దక్కాలంటే ఆయన్ని అడ్డు తొలగించుకోవాలని నూరిపోసింది. భర్తను వదిలించుకోవాలన్న ఉషారాణికి కుమారుడు తోడయ్యాడు. ఈ క్రమంలో ఆమె తన మాట వినే న్యాయవాది కునిశెట్టి శ్రీధర్‌తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో న్యాయవాది కిరాయి హంతకులైన గంగరాజు, పోలురాజుతో కలిసి విజయ్‌కుమార్‌ హత్యకు పథకం వేశారు. 2015 సంవత్సరం మే 28 అర్ధరాత్రి తర్వాత వేదాయపాళెంలో విజయ్‌కుమార్‌ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. ఆయన నిద్రిస్తుండగా గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

ఆర్థిక సంబంధాలుగా..
ఆధునిక సమాజంలో కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని విజయ్‌కుమార్‌ హత్య ద్వారా మరోమారు నిరూపితమైంది. ఆస్తి కోసం హత్య చేసి తమ నిండు జీవితాలను జైలుపాలు చేసుకున్నారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయనేందుకు విజయ్‌కుమార్‌ వ్యవహారం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.

బెడిసికొట్టిన ప్లాన్‌
విజయ్‌కుమార్‌ను హత్య చేసిన తర్వాత నిందితులంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. తెల్లవారిన తర్వాత విజయ్‌కుమార్‌ మరణ వార్త అందరికీ తెలిసింది. ఉషారాణి ఏమీ తెలియనట్లు భర్త మృతదేహాన్ని బొల్లినేని ఆస్పత్రికి తరలించింది. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మరణించినట్లు పేర్కొనగా మృతదేహాన్ని బాలాజీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లింది. హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. ఇంతలో విజయ్‌కుమార్‌ మిత్రులు కొంతమందితో కలిసి ఆత్మకూరుకు చెందిన న్యాయవాది శేషారెడ్డి అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించి మెడ వద్ద గొంతు నులిమినట్లు ఉండడంతో హత్యగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యగా తేలింది. పోలీసులు విచారించగా కట్టుకున్న భార్య, కన్న బిడ్డ, ఒక న్యాయవాది, మరో ఇద్దరు కిరాయి హంతకులు కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు చార్జిషీట్లు వేసి కోర్టులో దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులకు శిక్ష పడింది. ఈ కేసులో శిక్షపడిన నిందితుడు కునిశెట్టి శ్రీధర్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రస్తుత కార్యదర్శిగా ఉన్నారు.

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top