1.17 ఎకరాల గ్రామ స్థలం కబ్జా
దానమిచ్చిన
స్థలాన్నే కబ్జా చేశారు
గ్రామ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూమిని గొప్ప మనస్సుతో పెద్దలు దానం చేశారు. వీటిని 14 – 03 – 1966న 155 – 1966 నంబర్‌పై రిజిస్టర్ చేశారు. ఇందులో 4.42 ఎకరాలను గ్రామంలోని పాఠశాల, రోడ్డుకు వినియోగించాం. మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశారు. ఈ విషయమై నిలదీద్దామంటే సదరు వ్యాపారి గ్రామం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఎక్కడో ఉండి ప్లాట్లను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లభించడంలేదు.
– పెనాక నాగశ్రీనివాసులురెడ్డి,
మాజీ సర్పంచ్, పెయ్యలపాళెం
మా భూమిని ఇప్పించండయ్యా..
మా పూర్వీకులతో పాటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ధారాదత్తం చేసిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారులకు మొరపెట్టుకున్నా, పట్టించుకున్న దాఖలాల్లేవు. వీటిని వ్యాపారి విక్రయించి చేతులు దులుపుకొన్నారు. ఆయన లాభపడినా.. కొనుగోలు చేసిన వారు నష్టపోతారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని స్థలాన్ని మాకు అందించాలి.
– కర్తం బుజ్జిరెడ్డి, రైతు, పెయ్యలపాళెం
రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కాసులు కురిపించుకోవడమే లక్ష్యంగా.. సమీపంలో ఎవరి భూములున్నా ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే వస్తోందనే ఆశతో వీటికి అనుమతులున్నాయా లేదాననే అంశాన్ని పట్టించుకోకుండా పలువురు కొనుగోలు చేసి ఆపై లబోదిబోమంటున్నారు. కొడవలూరు మండలం గండవరం రెవెన్యూ పరిధిలోని పెయ్యలపాళెంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు విస్తుగొల్పుతున్నాయి.
కొడవలూరు: మండలంలోని పెయ్యలపాళెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. భూములు కనిపిస్తే చాలు అవి తమవా.. కాదాననే అంశాన్ని సైతం పట్టించుకోకుండా వాటిని ఆక్రమిస్తున్నారు. పెయ్యలపాళెంలో కర్తం చంద్రశేఖర్‌రెడ్డి, మరో 11 మంది పెద్ద రైతులు గ్రామావసరాల నిమిత్తం స్వచ్ఛందంగా 5.52 ఎకరాల భూమిని 1966లో దానం చేశారు. ఇందులో 4.42 ఎకరాలను గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ప్రధాన రహదారికి వినియోగించారు. మిగిలిన 1.17 ఎకరాలను భవిష్యత్తు అవసరాల నిమిత్తం అలానే ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ ప్రాంతంతో పశువులను మేపుకొంటూ వచ్చారు.
ఆక్రమించి.. ప్లాట్లు వేసి
ఇక్కడికి అత్యంత సమీపంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, ఇఫ్కో కిసాన్ సెజ్ ఏర్పడ్డాయి. వీటిని చూపి ప్లాట్లు విక్రయించుకొని కాసులు కురిపించుకోవచ్చని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెయ్యలపాళెం వద్ద 11.24 ఎకరాలను కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని ఉన్న గ్రామానికి చెందిన 1622, 1623 సర్వే నంబర్లలో గల 1.17 ఎకరాలను ఆక్రమించారు. పంచాయతీ, నుడా అనుమతుల్లేకుండానే ప్లాట్లు వేసి విక్రయానికి పెట్టారు. అన్ని అనుమతులతో అంకణం రూ.25 వేల నుంచి రూ.30 వేలకే ఇస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేశారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటం.. కాస్త తక్కువ ధరకే వస్తుండటంతో కొందరు కొనుగోలు చేశారు. ఆపై ఆరాతీయగా, వీటికి ఎలాంటి అనుమతుల్లేవని తెలిసి నిర్ఘాంతపోయారు.
పట్టించుకునేవారేరీ..?
గ్రామావసరాల నిమిత్తం కేటాయించిన భూమిని సైతం ఆక్రమించడంతో విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు.. సమస్యను నుడా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ భూమిని తమకు అందజేస్తే వినియోగించుకుంటామని మొరపెట్టుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం కాసులు దండుకొని జేబులు నింపుకొంటున్నారు.
చెట్లకు అవతలి వైపునున్న భూమిని కబ్జా చేసి.. ప్లాట్లుగా మార్చారిలా..
అనుమతుల్లేకుండానే ప్లాట్ల విక్రయం
అవసరాలకు దానమిచ్చిన
భూమికే ఎసరు
కొడవలూరు మండలం
పెయ్యలపాళెంలో ఇదీ తంతు
1.17 ఎకరాల గ్రామ స్థలం కబ్జా
1.17 ఎకరాల గ్రామ స్థలం కబ్జా


