ఆ బ్యాట్‌ ఎవరిది బాస్‌?

Yuvraj Singh Drops Cheeky Reply After Shubman Gill  - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-13లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘనవిజయాన్ని సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల సాధారణ టార్గెట్‌ను కేకేఆర్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో శుబ్‌మన్‌ గిల్‌(70 నాటౌట్‌; 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో కేకేఆర్‌ సునాయాసంగా విజయకేతనం ఎగురవేసింది. కేకేఆర్‌ విజయానంతరం గిల్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌ స్పందిస్తూ.. మార్కును చేరడం ఆనందంగా ఉంది అని పోస్ట్‌ చేశాడు.  తన బ్యాటింగ్‌ ఫోటోను కూడా షేర్‌ చేశాడు. దీనిపై యువరాజ్‌ సింగ్‌ ట్వీటర్‌లో గిల్‌ను ప్రశంసిస్తూ సరదాగా చమత్కరించాడు. ‘ నైస్‌ బ్యాట్‌ మిస్టర్‌ గిల్‌. ఆ బ్యాట్‌ ఎవరిది?’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇలా యువీ కామెంట్‌ చేయడానికి కారణం ఉంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగంగా దాని బారిన పడిన వారికి సాయపడేందుకు ‘YouWeCan’ ఫౌండేషన్‌ స్థాపించాడు. అయితే గిల్‌ బ్యాట్‌పై ఇదే రాసి ఉండటంతో యువీ ఇలా రిప్లై ఇచ్చాడు.(చదవండి: ఆ ఒక్క బంతి మిస్‌ చేసినందుకు థాంక్స్‌: యువీ)

సన్‌రైజర్స్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ రెండో ఓవర్‌లోనే సునీల్‌ నరైన్‌ వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి నరైన్‌ ఔటయ్యాడు. ఆపై గిల్‌కు రాణా జత కలిశాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద ఉండగా కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చిన రాణా పెవిలియన్‌ చేరాడు. అనంతరం​ దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌ కావడంతో కేకేఆర్‌ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ గిల్‌-ఇయాన్‌ మోర్గాన్‌లు సన్‌రైజర్స్‌ మరో అవకాశం ఇవ్వకుండా జట్టును గెలిపించారు. ఈ జోడి అజేయంగా 92 పరుగులు జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top