WTC Final: ట్రోఫీ టీమిండియానే వరిస్తుంది: గంగూలీ

WTC Final: Sourav Ganguly Hopes WTC Trophy Comes To India - Sakshi

న్యూఢిల్లీ: మొట్టమొదటి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి, జట్టుకు ఇదొక మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో వేచిచూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేపటి(జూన్‌ 18) నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో భారత్‌- న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ తుదిపోరులో ఎలాగైనా టీమిండియా విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆజ్‌తక్‌తో మాట్లాడిన గంగూలీ..‘‘ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడటం ఇదే తొలిసారి. ఏ క్రికెటర్‌కైనా ఇదొక ఉద్విగ్న క్షణం. నిజానికి టెస్టు క్రికెట్‌ ప్రతీ ఆటగాడి కెరీర్‌లో ఒక అత్యుత్తమ అంకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాకు సారథ్యం వహిస్తున్నందుకు విరాట్‌ కోహ్లి ఎంతో సంతోషంగా ఉంటాడు.. ఒకింత గర్వపడతాడు కూడా. గత రెండేళ్లుగా ఎంతో మెరుగ్గా ఆడుతున్న కారణంగానే టీమిండియా ఫైనల్‌కు చేరుకోగలిగింది.

ముఖ్యంగా ఆస్ట్రేలియాతో సిరీస్‌ నెగ్గడం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. రెట్టించిన ఉత్సాహంతో.. పూర్తి ఆత్మవిశ్వాసంతో మన ఆటగాళ్లు మైదానంలో అడుగుపెడతారని నేను విశ్వసిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా.. న్యూజిలాండ్‌ జట్టుపై ప్రశంసలు కురిపించిన గంగూలీ.. గత కొన్నాళ్లుగా కివీస్‌ నిలకడగా ఆడుతోందని, ఇంగ్లండ్‌తో తాజాగా సిరీస్‌ నెగ్గడంతో వారిలో మరింత ఉత్సాహం నింపి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌ల ద్వారా వారికి పూర్తి ప్రాక్టీసు లభించిందని చెప్పుకొచ్చాడు.

చదవండి: WTC Final: కట్టిపడేస్తున్న 'భారత ఆర్మీ'.. వీడియో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top