
క్వార్టర్ ఫైనల్లోకి బెలారస్ స్టార్
లండన్: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక్కొక్కరూ వెనుదిరుగుతుండగా... మరోవైపు అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ బెలారస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా ముందంజ వేసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సబలెంకా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–4, 7–6 (7/4)తో ఎలీసా మెర్‌టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది.
122 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు రెండు సెట్‌లలో గట్టిపోటీ ఎదురైంది. అయితే కీలకదశలో సబెలంకా పైచేయి సాధించి వరుస సెట్‌లలో విజయాన్ని ఖరారు చేసుకుంది. అర డజను ఏస్‌లు సంధించిన సబలెంకా ఒక్కడబుల్ ఫాల్ట్ మాత్రమే చేసింది. నెట్ వద్దకు 15 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచింది. తన సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
36 విన్నర్స్ కొట్టిన సబలెంకా 18 అనవసర తప్పిదాలు చేసింది. ఆరోసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న సబలెంకా 2021లో, 2023లో సెమీఫైనల్లో ని్రష్కమించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) 7–6 (7/3), 6–4తో సోనె కర్తాల్ (బ్రిటన్)పై, లౌరా సిగెముండ్ (జర్మనీ) 6–3, 6–2తో సొలానా సియెరా (అర్జెంటీనా)పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
ఫ్రిట్జ్ మూడోసారి...
పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), కామెరాన్ నోరి (బ్రిటన్), కరెన్ ఖచనోవ్ (రష్యా) క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జోర్డాన్ థాంప్సన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రిట్జ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్‌లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో గాయం కారణంగా థాంప్సన్ వైదొలిగాడు. దాంతో ఈ టోర్నీలో ఫ్రిట్జ్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కామెరాన్ నోరి 4 గంటల 27 నిమిషాల్లో 6–3, 7–6 (7/4), 6–7 (7/9), 6–7 (5/7), 6–3తో నికోలస్ జారీ (చిలీ)పై, ఖచనోవ్ 6–4, 6–2, 6–3తో కామిల్ మజార్జక్ (పోలాండ్)పై గెలుపొందారు.