WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్‌ విషయంలో మాత్రం..

WPL 2023 Auction: All You Need To Know Who Is Costliest Player Details - Sakshi

WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్‌లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్‌ ప్లేయర్, వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది.

వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ స్టార్లు యాష్లే గార్డ్‌నర్, నటాలీ సివర్‌ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. 

ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్‌లు హర్మన్‌ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్‌ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్‌ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్‌ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్‌లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది.

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు.

నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్‌కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు  బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్‌ 18 మంది చొప్పున తీసుకున్నాయి.

టాప్‌–10 జాబితాలో
వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్‌–10 జాబితాలో భారత్‌ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్‌ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్‌ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు.

త్రిషకు మొండిచేయి
సీనియర్‌ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు  నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్‌లో అవకాశం దక్కింది. అయితే అండర్‌–19 ప్రపంచకప్‌లో రాణించిన హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్‌ నిర్వహిస్తారు.

ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్‌ డబ్ల్యూపీఎల్‌ వేలంను నిర్వహించింది.  

వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ
భారత జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్‌బాష్‌ లీగ్, ‘హండ్రెడ్‌’ లీగ్‌లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్‌పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి.

టీమిండియా టాప్‌ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ అయిన యాష్లే గార్డ్‌నర్‌పై కూడా టీమ్‌లు ఆసక్తి చూపించాయి.

వారికి కూడా తక్కువేం కాదు
ఆసీస్‌ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌లకు కూడా మంచి విలువ దక్కింది.

గుర్తింపు ఉన్నా
ఇక.. మహిళల టి20 క్రికెట్‌లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్‌ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్‌ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు.

హర్మన్‌ విషయంలో మాత్రం
►భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కోసం గుజరాత్‌ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు.  
►అసోసియేట్‌ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్‌ తారా నోరిస్‌ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. 
►యూఏఈకి చెందిన మనిక గౌర్‌ కోసం గుజరాత్‌ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.  
►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు.   

స్మృతి తర్వాత వేలంలో టాప్‌–10 
►యాష్లే గార్డ్‌నర్‌ -రూ. 3 కోట్ల 20 లక్షలు 
►నటాలీ సివర్‌ -రూ. 3 కోట్ల 20 లక్షలు 
►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు 
►జెమీమా రోడ్రిగ్స్‌ - రూ. 2 కోట్ల 20 లక్షలు 
►బెత్‌ మూనీ -రూ. 2 కోట్లు 

►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు 
►పూజ వస్త్రకర్‌ -రూ. 1 కోటి 90 లక్షలు 
►రిచా ఘోష్‌ -రూ. 1 కోటి 90 లక్షలు 
►సోఫీ ఎకిల్‌స్టోన్‌- రూ. 1 కోటి 80 లక్షలు 
►హర్మన్‌ప్రీత్‌ - రూ. 1 కోటి 80 లక్షలు  
– సాక్షి క్రీడా విభాగం

చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి..  
Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్‌ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఘోర తప్పిదం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top