PC: DC
టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్లో కోచ్‌గా ప్రయాణం మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే సీజన్లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్, అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇందుకు సంబంధించి ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇటీవలే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అపార అనుభవం
టీ20 ప్రపంచకప్- 2007, 2011 వన్డే వరల్డ్ కప్‌లు గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడైన యువరాజ్ అపార అనుభవం తమ టీమ్‌కు ప్రయోజనం కలిగిస్తుందని క్యాపిటల్స్ భావిస్తోంది. ఇటీవలే సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌గా ఎంచుకున్న జట్టు అదే క్రమంలో యువీని కూడా ఎంపిక చేయడం విశేషం. ఈ నేపథ్యంలో గంగూలీతో తన అనుబంధం గురించి యువీ తాజాగా మాట్లాడాడు.
నా అసిస్టెంట్‌గా ఉంటావా?
‘‘గంగూలీ ఫోన్ చేసి.. ‘నా అసిస్టెంట్‌గా ఉంటావా?’ అని అడిగాడు. అప్పుడు నేను.. ‘గత 25 ఏళ్లుగా నేను నీకు అసిస్టెంట్‌గానే ఉన్నాను కదా. ఇప్పుడు కూడా అదే పని చేస్తా’ అని బదులిచ్చాను. చుట్టూ ఉన్న గంభీర వాతావరణాన్ని కూడా తేలికపరిచడం దాదాకు అలవాటు.
ఆయన నుంచి నేను నేర్చుకున్న అత్యుత్తమ విషయం ఇదే. నా అరంగేట్ర సమయంలో దాదా కెప్టెన్‌గా ఉన్నాడు. జట్టును ఏకతాటిపై నడిపించాడు. మేము గొప్ప జట్టుగా ఎదగగలమనే ఆత్మవిశ్వాసాన్ని మాలో నింపాడు. విదేశీ గడ్డ మీద కూడా సిరీస్‌లు గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చాడు.
నాకు పెద్దన్న లాంటివాడు
దాదా నాకు పెద్దన్న లాంటివాడు. సెలక్షన్ విషయంలో.. మెంటార్‌గా నాకు సరైన మార్గం చూపించాడు. నేను మంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలో దాదా పాత్ర కూడా ఉంది’’ అని యువరాజ్ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
కాగా 2000 సంవత్సరంలో టీమిండియాలో అడుగుపెట్టిన యువీ.. 2019లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఐపీఎల్లో మొత్తం 132 మ్యాచ్‌లు ఆడి 129.71 స్ట్రయిక్‌రేట్‌తో 2750 పరుగులు చేశాడు. 2015లో ఒకే ఒక సీజన్లో అతను ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ చరిత్రలో అప్పటి అత్యధిక విలువతో (రూ.16 కోట్లు) వేలంలో యువీని ఢిల్లీ సొంతం చేసుకుంది.
మెంటార్‌గా
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు అధికారికంగా కోచ్ పాత్ర పోషించకపోయినా... యువరాజ్ సింగ్ ఇప్పటికే అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రిషభ్ పంత్వంటి ఆటగాళ్లకు మెంటార్‌గా మార్గనిర్దేశనం చేశాడు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ భాగస్వాములైన జీఎంఆర్ గ్రూప్, జేఎస్‌డబ్ల్యూ ప్రతీ రెండేళ్లకు ఒకసారి నిర్వహణా బాధ్యతలు మార్చుకుంటాయి. ఈ క్రమంలోనే 2027, 2028లలో టీమ్‌ను నడిపించనున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ యజమాని పార్థ్ జిందాల్...రిషభ్‌పంత్‌ను తిరిగి ఢిల్లీ టీమ్‌లోకి తీసుకురావడంతో పాటు గంగూలీని హెడ్ కోచ్‌గా, యువీని అసిస్టెంట్ కోచ్‌గా ఎంచుకున్నారు.
చదవండి: IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్


