‘శ్రేయస్‌ అయ్యర్‌ గ్యాంగ్‌కు ప్లేఆఫ్స్‌ చాన్స్‌ కష్టమే’

Worried About Delhi Capitals, Sangakkara - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఘోర పరాజయం చవిచూడటం కంటే ముందుగానే సంగక్కార ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ -2020 స్టార్‌ స్పోర్ట్స్‌ కామెంటరీ ప్యానల్‌లో జాయిన్‌ అయిన సంగక్కార లైవ్‌ షోలో మాట్లాడుతూ శ్రేయస్‌ అయ్యర్‌ అండ్‌ గ్యాంగ్‌ బ్యాటింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ పేలవమైన బ్యాటింగ్‌ను చూస్తుంటే ఆ జట్టు టాప్‌-4లో నిలవడం చాలా కష్టమన్నాడు. ('నేను బౌలింగ్‌కు వస్తే గేల్‌ సెంచరీ చేయలేడు')

‘ఢిల్లీ టాపార్డర్‌ బ్యాటింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. వారి టాపార్డర్‌ రాణిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు పెట్టుకోవచ్చు. గ్యారంటీగా ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని చెప్పలేను. ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ ప్లేఆఫ్‌ చాన్స్‌లు చాలా తక్కువ. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరింది. ఆర్సీబీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కింగ్స్‌ పంజాబ్‌ కూడా టాప్‌-4లో ఉంటుందనే అనుకుంటున్నా. కానీ ప్లేఆఫ్‌ స్థానం దక్కించుకునే నాల్గో జట్టు ఏదో చెప్పడం నాకు కష్టంగా ఉంది’ అని సంగక్కరా అభిప్రాయపడ్డాడు.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ దారుణమైన ఓటమి చవిచూసింది.  దాంతో ఆ జట్టు నెట్‌రన్‌రేట్‌ మైనస్‌లోకి వెళ్లిపోయింది. అటు తొలుత బ్యాటింగ్‌లో నిరాశపరిచిన ఢిల్లీ, బౌలింగ్‌లో కూడా రాణించలేదు. దాంతో ముంబై ఇండియన్స్‌ ఈజీ విక‍్టరీని నమోదు చేసింది.  ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషాన్‌(72 నాటౌట్‌; 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. (టాప్‌ లేపిన ముంబై.. చిత్తుగా ఓడిన ఢిల్లీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top