వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. ఈసారి చాంపియన్స్‌ ట్రోఫీ వారికే: ‍క్రిస్‌ గేల్‌ | Wi Legend Chris Gayle Picks India As Favourites To Win Champions Trophy 2025, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Chris Gayle: అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. ఈసారి చాంపియన్స్‌ ట్రోఫీ వారికే

Feb 11 2025 8:55 PM | Updated on Feb 12 2025 9:06 AM

World Class Player: WI Legend Chris Gayle Picks favourites to win CT 2025

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో విజేతగా ఎవరన్న అంశంపై వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌(Chris Gayle) తన అంచనా తెలియజేశాడు. ఈసారి టీమిండియానే టైటిల్‌ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా 2013లో మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత్‌.. 2017లో ఫైనల్‌ చేరింది.

తటస్థ వేదికపై రోహిత్‌ సేన
అయితే, నాటి టైటిల్‌ పోరులో దాయాది పాకిస్తాన్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి ఈ వన్డే ఫార్మాట్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో పాకిస్తాన్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకోగా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించింది.

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)తో ఈ విషయం గురించి చర్చించగా.. తటస్థ వేదికపై రోహిత్‌ సేన మ్యాచ్‌లు ఆడేలా హైబ్రిడ్‌ విధానానికి అంగీకరించింది. అయితే, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తొలుత ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోయినా.. ఐసీసీ చర్యలకు ఉపక్రమించడంతో దిగివచ్చింది. దీంతో దుబాయ్‌ వేదికగా టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమమైంది.

రెండు గ్రూపులు
మరోవైపు.. పాకిస్తాన్‌లోని రావల్పిండి, కరాచి, లాహోర్‌ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. ఇక ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ అర్హత సాధించగా.. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-‘ఎ’లో భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ ఉండగా.. గ్రూప్‌-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ ఉన్నాయి.

ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య కరాచీ వేదికగా మ్యాచ్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న ఈ ఐసీసీ ఈవెంట్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్‌ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్‌ సేన.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతంర మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

ఐసీసీ టోర్నీలలో అద్భుతంగా
కాగా సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌-2023లో ఫైనల్‌ వరకు అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై తడబడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా ప్రేక్షకుల నడుమ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై.. టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే, అనంతరం టీ20 ప్రపంచకప్‌-2024లో ఆఖరి వరకు జైత్రయాత్ర కొనసాగించి చాంపియన్‌గా అవతరించింది.

ఇదే జోరులో చాంపియన్స్‌ ట్రోఫీలోనూ అడుగుపెట్టనున్న రోహిత్‌ సేనకు.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ మంచి సన్నాహకంగా ఉపయోగపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 

ఇక రెండో వన్డే సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చి.. విధ్వంసకర శతకం(90 బంతుల్లో 119 రన్స్‌) బాదడం టీమిండియాకు అతిపెద్ద సానుకూలాంశంగా పరిణమించింది.

అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్‌ తక్‌తో మాట్లాడిన విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌.. ‘‘చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియానే ఫేవరెట్‌. టైటిల్‌ గెలిచే జట్టు ఇదే’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా రోహిత్‌ శర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌. 

వన్డేల్లో డబుల్‌ సెంచరీలు చేసిన ఘనత అతడిది. హిట్‌మ్యాన్‌ అతడు. వన్డేల్లో నా సిక్సర్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. టెస్టుల్లో విఫలమైనా మెగా టోర్నీలో మాత్రం తప్పక రాణిస్తాడు’’ అని క్రిస్‌ గేల్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్‌ టైటాన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement