Womens World Boxing Championship 2023:‘డబుల్‌’ గోల్డెన్‌ పంచ్‌

Womens World Boxing Championship 2023: Nitu Ghanghas, Saweety Boora win gold medals - Sakshi

ప్రపంచ చాంపియన్లుగా నీతూ, స్వీటీ

ఫైనల్‌ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన

మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

నేడు నిఖత్, లవ్లీనా తుది సమరాలు  

ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్‌ విభాగంలో ఇది తొలి టైటిల్‌ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత.  

న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్‌ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ సాధించడం విశేషం.

ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్‌ అల్టాన్‌సెట్సెగ్‌ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్‌ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్‌ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్‌ మరో రెండు స్వర్ణాలను
ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్‌ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్‌ ఫైనల్‌ బరిలోకి దిగుతారు.  

ఏకపక్షంగా...
భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్‌లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్‌ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్‌ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్‌ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్‌ పెనాల్టీ కూడా విధించారు.

దాంతో రెండో రౌండ్‌ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్‌ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్‌ కాంస్యపతక విజేత విజేందర్‌ సింగ్‌ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు.  

అటాక్‌...డిఫెన్స్‌...
గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్‌ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్‌ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్‌లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్‌లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్‌ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్‌ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్‌లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్‌ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది.  విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

భారత్‌ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్‌ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్‌ఎల్‌ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్‌ జరీన్‌ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు.  

22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్‌ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్‌’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్‌ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన.

30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్‌ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్‌ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ దీపక్‌ నివాస్‌ హుడా ఆమె భర్త.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top