ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే గ్రౌండ్‌లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తే క్రమంలో స్పైక్ షూ ఉంటే మరింత బాగా పరిగెత్తగలవని ఎవరో చెబితే విన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అక్కడ వాలిపోయేవాడు.
ఎందుకంటే వాళ్లిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు స్పైక్ షూ కొనుగోలుకు ఉపయోగపడుతాయని ఆ కుర్రాడి ఆరాటం. అయితే తల్లికి విషయం తెలిసి తనకున్న నగలు అమ్మి స్పైక్ షూ కొని కొడుకు కోరిక తీర్చింది. ఇలా కష్టాల సుడిగుండాలను చిన్నతనంలోనే అనుభవించి, ఇవాళ వాటిని దాటుకొని ఐపీఎల్‌లో అవకాశం దక్కించుకొని రైజింగ్ స్టార్ అయ్యాడు సాకిబ్ హుస్సేన్.
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఎస్ఆర్‌హెచ్ బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ ఓటమికి ఇద్దరు బౌలర్లు ప్రధాన కారణంగా నిలిచారు. వారిలో ఒకరు ప్రఫుల్ హింగే అయితే.. రెండో వ్యక్తి సాకిబ్ హుస్సేన్.
ఇద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం, ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీయడం విశేషం. అయితే ప్రఫుల్ హింగేతో పోలిస్తే ఎకానమీ పరంగా సాకిబ్ హుస్సేన్ ఒక మెట్టు పైనే ఉంటాడు. జైస్వాల్, ఆర్చర్, ఫెరీరా, బిష్ణోయ్ వికెట్లను ఖాతాలో వేసుకున్న సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఇక ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ప్రఫుల్ హింగే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్నారు. కానీ అతనితో సమానంగా సాకిబ్ హుస్సేన్ ప్రదర్శనను కూడా గుర్తించాల్సిన అవసరముంది.
సైన్యంలో చేరాలనుకొని..
బీహార్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్, సుబుక్తారా ఖతాన్ దంపతులకు సాకిబ్ హుస్పేన్ 2004లో జన్మించాడు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే సాకిబ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని సాకిబ్ పరితపించేవాడు. సైన్యంలో చేరేందుకు సమీప గ్రౌండ్‌లో రన్నింగ్‌కు వెళ్లేవాడు.
అప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. రన్నింగ్ బాగా చేయాలంటే స్పైక్ షూ అవసరమని గుర్తించిన సాకిబ్ తన ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉండడంతో ఇంట్లోవాళ్లను అడగడం ఇష్టం లేక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేవాడు. వారిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు దాచుకునేవాడు.
తల్లి నగలు అమ్మి..
అయితే స్పైక్ షూ కొనడానికి డబ్బులు చాలా కావాలని భావించిన సాకిబ్ తన మనసులోని మాటను కన్నతల్లికి చెప్పడం, ఆ తల్లి తనకున్న కొద్దిపాటి నగలు అమ్మి కొడుకు కోరికను తీర్చింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించడంతో సాకిబ్ హుస్సేన్‌కు 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం లభించింది. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున రైట్ ఆర్మ్ పేసర్‌గా అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సాకిబ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇక 2025-26 రంజీ సీజన్‌లో బీహార్ తరఫున ఆడిన సాకిబ్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యచ్‌లో 41 పరుగులకే 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తొలిసారి సాకిబ్ వేలంలోకి వచ్చినప్పటికీ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో 140 ప్లస్‌కు తగ్గకుండా బౌలింగ్ వేస్తున్న విషయాన్ని గుర్తించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలిపెట్టింది.
వరుణ్ ఆరోన్ దృష్టిలో పడి..
అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనను తాను మరింత సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ లైనప్‌లో కుర్రాళ్లు కావాలని వరుణ్ ఆరోన్ తన వేటను ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్ల సంచలన ప్రదర్శన నమోదు చేసిన సాకిబ్ హుస్సేన్ వరుణ్ ఆరోన్‌ను ఆకర్షించాడు.
అలా గతేడాది మినీ వేలంలో సాకిబ్ హుస్సేన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు సాకిబ్ హుస్సేన్.
Another debutant making his mark ✅
🎥 Glimpses of Sakib Hussain’s 4/24 in his first outing in #TATAIPL 🔥
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @sunrisers pic.twitter.com/ByAMDOgJiB— IndianPremierLeague (@IPL) April 13, 2026
A NIGHT FOR THE DEBUTANTS! 🤩
Praful Hinge and Sakib Hussain giving #TATAIPL fans a game to remember 🤜🤛
Watch Hussain's spell ▶️ https://t.co/pFEeR4dHxD#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/YBpnrflB7o— IndianPremierLeague (@IPL) April 13, 2026


