Duleep Trophy 2022: 294 పరుగులతో సౌత్‌జోన్‌ ఓటమి.. దులీప్‌ ట్రోఫీ విజేత వెస్ట్‌జోన్‌

West Zone Beat South Zone By-294 Runs In Final Clinch Duleep Trophy 2022 - Sakshi

దులీప్‌ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్‌జోన్‌ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌జోన్‌రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్‌జోన్‌ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్‌జోన్‌ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది.

సౌత్‌జోన్‌ బ్యాటింగ్‌లో రోహన్‌ కన్నుమ్మల్‌ 93 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హైదరాబాద్‌కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్‌ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్‌జోన్‌ బౌలర్లలో షామ్స్‌ ములాని 4, జైదేవ్‌ ఉనాద్కట్‌, అతిత్‌ సేత్‌ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్‌ కొటేన్‌, చింతన్‌ గజా చెరొక వికెట్‌ తీశారు. డబుల్‌ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. జైదేవ్‌ ఉనాద్కట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన వెస్ట్‌జోన్‌ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ (127 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... హెట్‌ పటేల్‌ (51 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించాడు.  ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌ 327 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్ట్‌జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది.

చదవండి: 'అండర్సన్‌ రిటైర్‌ అయితే ఇలానే ఏడుస్తానేమో!'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top