‘భద్రత కల్పిస్తాం.. ఒక్కసారి పాకిస్తాన్‌కు రండి’ | We Give You Security Come Once: Former Pakistan Pacer Dare To Team India And BCCI For Champions Trophy 2025 | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: ‘భద్రత కల్పిస్తాం.. ఒక్కసారి పాకిస్తాన్‌కు రండి’

Jul 31 2024 9:23 PM | Updated on Aug 1 2024 1:36 PM

We Give You Security Come Once: Former Pakistan Pacer Dare To Team India

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ మాజీ పేసర​ తన్వీర్‌ అహ్మద్‌ ఘాటుగా స్పందించాడు. భారత జట్టుకు ధైర్యం ఉంటే పాక్‌ పర్యటనకు రావాలని సవాల్‌ విసిరాడు. తాము ధైర్యవంతులం కాబట్టే భారత్‌లో మ్యాచ్‌లు ఆడామని.. భద్రత కల్పిస్తామని చెప్తున్నా టీమిండియా మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించాడు.

నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్‌ 
కాగా వచ్చే జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్‌ సేనను పాకిస్తాన్‌కు పంపించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా వన్డే కప్‌-2023 మాదిరే ఈ ఐసీసీ టోర్నీని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లోనే నిర్వహించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి ఇప్పటికే తమ డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి వద్ద కూడా బలంగానే వినిపించినట్లు తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాత్రం.. లాహోర్‌లో సురక్షిత వాతావరణంలో టీమిండియా మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఐసీసీకి కూడా చెప్పిందని.. బీసీసీఐని ఒప్పించాల్సిన బాధ్యత కూడా ఐసీసీకే అప్పగించినందని పాక్‌ మీడియా పేర్కొంది.

పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సేఫ్‌ కాదు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్‌కు వెళ్లడం అంత సేఫ్‌ కాదు. అక్కడ ప్రతిరోజూ ఏదో దుర్ఘటన జరుగుతూనే ఉంటుంది. టీమిండియా విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే. అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే ముఖ్యం’’ అని భజ్జీ పేర్కొన్నాడు.

ఒక్కసారి ఇక్కడికి రండి చాలు!.
ఈ క్రమంలో తన్వీర్‌ అహ్మద్‌ స్పందిస్తూ.. ‘‘మేము సింహాలం. మీ డెన్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడాము. మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ఇక్కడికి రండి. మీకు కావాల్సిన భద్రత మేము కల్పిస్తాం. ఏం కావాలంటే అది చేసి పెడతాం. ఒక్కసారి ఇక్కడికి రండి చాలు!.. మా జట్టుకు ధైర్యం ఎక్కువ. అందుకే మేము భారత్‌లో టోర్నీలు ఆడుతున్నాం’’ అని పేర్కొన్నాడు. అయితే, తన్వీర్‌ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. భారత్‌ సురక్షితం కాబట్టే పాక్‌ ప్లేయర్లు ఇక్కడకు వచ్చారని.. అందుకు తగ్గట్లుగానే వారిని బీసీసీఐ సేఫ్‌గా పాక్‌కు పంపిందని పేర్కొంటున్నారు.

అయితే, ఈ విషయంలో భారత్‌కు పాకిస్తాన్‌కు చాలా తేడా ఉందని.. పాక్‌ వెలుపలే టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌-2023 సందర్భంగా పాకిస్తాన్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేలవమైన ఆట తీరుతో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌ రన్నరప్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా చాంపియన్‌గా అవతరించింది. కాగా టీమిండియా చివరిసారిగా 2006లో పాకిస్తాన్‌లో పర్యటించింది. అయితే, 2008లో ముంబై దాడుల తర్వాత భారత జట్టును అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది.

చదవండి: Ind vs SL: గంభీర్‌ గైడెన్స్‌.. కోహ్లి- రోహిత్‌ ప్రాక్టీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement