WC 2022: ఒక్క క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. జట్టులో తెలుగు కుర్రాడు కూడా!

ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సూపర్-12 చేరాలంటే ఇతర జట్ల ఫలితంపై ఆధారపడ్డ నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్-12లో భాగంగా తమ ఆఖరి మ్యాచ్‌లో మేటి జట్టు ప్రొటిస్‌తో ఆదివారం తలపడ్డ డచ్ జట్టు అంచనాలు తలకిందులు చేసింది. సౌతాఫ్రికా తమ ‘చోకర్స్ ట్యాగ్‌ను నిలబెట్టుకునేలా’ చావు దెబ్బ కొట్టింది.
బవుమా బృందాన్ని 13 పరుగుల తేడాతో ఓడించి సఫారీల సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. మేటి జట్లతో పాటుగా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచి చరిత్ర సృష్టించింది.
ప్రొటిస్ చేజేతులా
ఇక స్టార్ పేసర్లున్న దక్షిణాఫ్రికా జట్టు డచ్ జట్టు బ్యాటర్లను కట్టడి చేయలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కూల్చి 158 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. మరి లక్ష్య ఛేదనలో బ్యాటర్లు మెరుగ్గా ఆడారా అంటే అదీ లేదు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ 13, తెంబా బవుమా 20, ఈ ఎడిషన్లో తొలి సెంచరీ వీరుడు రిలీ రోసో 25 పరుగులు చేయగా.. మార్కరమ్ 17, డేవిడ్ మిల్లర్ 17, హెన్రిచ్ క్లాసెన్ 21 పరుగులకే పరిమితమయ్యారు.
మ్యాచ్ ఫలితాన్నే మార్చి వేసేలా అద్భుత క్యాచ్
ముఖ్యంగా జట్టును ఒంటిచేత్తో గెలిపించగల కిల్లర్ మిల్లర్ అవుట్ కావడంతో సఫారీ జట్టు ఓటమి దిశగా పయనించింది. మరి మిల్లర్‌ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపింది ఎవరో తెలుసా? నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డర్ మెర్వ్.
అతడు పట్టిన సూపర్ క్యాచ్‌తోనే సఫారీ టీమ్ ఓటమి దిశగా మళ్లింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2009, 2010 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా తరఫునే ఆడిన వాన్ డర్ మెర్వ్ ఈసారి అదే జట్టును దెబ్బ కొట్టాడు.
విజయానికి 29 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో 16వ ఓవర్లో డచ్ బౌలర్ గ్లోవర్ వేసిన బంతిని మిల్లర్ పుల్ చేయబోగా బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్‌లెగ్‌లో ఉన్న మెర్వ్ వెనక్కి తిరిగి పరుగెడుతూ స్క్వేర్‌లెగ్ వద్ద అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.
సౌతాఫ్రికాకు ఆడి.. ఆ జట్టునే దెబ్బ కొట్టి
వాన్ డర్ మెర్వ్ ఒక్కడే కాదు.. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను గెలిపించిన స్టీఫెన్ మైబర్గ్, కొలిన్ అకర్‌మన్, బ్రెండన్ గ్లోవర్ దక్షిణాఫ్రికాలోనే పుట్టి అక్కడే దేశవాళీ క్రికెట్ ఆడటం విశేషం. ఆ తర్వాత వీళ్లంతా నెదర్లాండ్స్‌కు వలస వెళ్లారు.
కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి నెదర్లాండ్స్‌ను గెలుపులో కీలక పాత్ర పోషించిన అకర్‌మెన్ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం మరో విశేషం.
మన వాళ్లు కూడా!
టీ20 ప్రపంచకప్-2022కు ఎంపికైన డచ్ జట్టులో సౌతాఫ్రికాకు చెందిన ప్లేయర్లు మాత్రమే కాదు.. భారత్‌లో పుట్టిన క్రికెటర్లు కూడా ఉండటం గమనార్హం. అందునా తెలుగు నేలపై పుట్టిన ఆటగాడు మరో విశేషం.
ఎడమచేతి వాటం గల బ్యాటర్ విక్రమ్‌జిత్ సింగ్ పంజాబ్‌లో జన్మించి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన తేజ నిడమానూరు కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఇక సూపర్-12లో భాగంగా విక్రమ్‌జిత్ టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఒక్క పరుగు మాత్రమే చేయగా.. 28 ఏళ్ల తేజకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.
చదవండి: T20 WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు
T20 WC IND Vs ENG Semi Final: ఇంగ్లండ్‌తో మ్యాచ్ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే!
మరిన్ని వార్తలు