'మ్యాచ్‌ను 5 రోజుల వరకు తీసుకెళ్లలేం'

Virat Kohli Says We Play To Win Not To Take Game Till 5th Day - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా పింక్‌ బాల్‌ టెస్టులో విజయం సాధించిన తర్వాత పిచ్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పలువురు మాజీ ఆటగాళ్లు పిచ్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసలు ఇది టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు పనికిరాదంటూ విమర్శలు గుప్పించారు. అయితే నాలుగో టెస్టుకు ఒక్కరోజు ముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మొటేరా పిచ్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''పిచ్‌పై అనవసరమైన చర్చ ఎందుకు జరుపుతున్నారో అర్థం కావడం లేదు. మూడోటెస్టులో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్లే ఆ మ్యాచ్‌ రెండు రోజుల్లో ముగిసిందని ఇప్పటికే చెప్పాం. ఇరు జట్లలో బ్యాటింగ్‌ సరిగా చేయకపోవడం.. బ్యాటింగ్‌లో కొంత ఓర్పు ప్రదర్శిస్తే పరుగులు వస్తాయని రోహిత్‌ తన ఇన్నింగ్స్‌ ద్వారా చూపించాడు. అయినా ఇప్పుడు నాలుగో టెస్టు గెలవడంపైనే ఫోకస్‌ పెట్టాం. మా దృష్టిలో మ్యాచ్‌ను ఐదు రోజుల వరకు తీసుకెళ్లే ఆలోచన లేదు.. ఎంత త్వరగా ముగిద్దామా అని అనుకుంటున్నాం.

మేము ఆసీస్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో ఉండి ఇదే పరిస్థితిని ఎదుర్కొని ఉంటే అప్పుడు ప్రశ్నలు సంధించి ఉంటే సంతోషపడేవాళ్లం. ఎవరైనా హోంగ్రౌండ్‌లో తమకు అనుకూలంగా ఉన్న పిచ్‌లను తయారు చేసుకుంటారన్నది అందరికి తెలిసిన నిజం. అయితే ఇక్కడ నేనే ఒక ప్రశ్న అడుగుదామని అనుకుంటున్నా.. అది ఏంటంటే.. మ్యాచ్‌ గెలవడానికి ఆడుతామా.. లేక ఐదు రోజులు పాటు కొనసాగనిస్తామా? నా దృష్టిలో మాత్రం మేం మ్యాచ్ గెలిస్తేనే అభిమానులు సంతోషిస్తారు.. అది మూడురోజులో లేక ఐదు రోజులు పట్టొచ్చు. పిచ్‌ స్పిన్‌కు బాగా అనుకూలిస్తే మాత్రం ఈ మ్యాచ్‌కు ఐదు రోజులు అవసరం కాకపోవచ్చు.

మూడో టెస్టులో అదే జరిగింది. అక్కడ పరుగులు రాకపోవచ్చు.. కానీ బౌలర్లు వికెట్లు తీశారు. ఇరు జట్ల బౌలర్లు వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు.. ఒక్క మ్యాచ్‌కే ఇలా పిచ్‌ను నిందించడం తప్పు'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నాలుగో టెస్టులో గెలుపు కష్టమనుకుంటే మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా చాలు.. జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఇప్పటికే కివీస్‌ డబ్య్లూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: 
'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి'
'రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉంటుందంటావు!'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top