‘కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్‌’

Virat Kohli opening at T20 World Cup is an option for us says Rohit Sharma - Sakshi

రాహుల్‌ విషయంలో మాకు స్పష్టత ఉంది

భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యాఖ్య   

మొహాలి: ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి విరాట్‌ కోహ్లి సెంచరీ సాధించాడు. దాంతో టి20ల్లో రోహిత్‌తో కలిసి కోహ్లి ఓపెనింగ్‌ చేయాలనే సూచనలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయిు. కేఎల్‌ రాహుల్‌ వేగంగా ఆడలేడనే కారణం కూడా దానికి జోడించారు. అయితే దీనిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తి స్పష్టతనిచ్చాడు. రాహుల్‌కు మద్దతుగా నిలుస్తూ అతనే ప్రధాన ఓపెనర్‌ అని, కోహ్లిని తాము మూడో ఓపెనర్‌గానే చూస్తున్నామని వెల్లడించాడు.

అవసరమైతే కొన్ని మ్యాచ్‌లలో కోహ్లికి ఓపెనింగ్‌ అవకాశం ఇస్తామని, అయితే రాహుల్‌ విలువేంటో తమకు బాగా తెలుసని చెప్పాడు. ‘ప్రపంచకప్‌లాంటి టోర్నీకి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మంచిదే. ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలి. అయితే ఒకసారి ఏదైనా ప్రయోగం చేశామంటే అదే శాశ్వతమని కాదు. మెగా టోర్నీకి ముందు ఆరు మ్యాచ్‌లు ఆడతాం కాబట్టి కోహ్లి ఓపెనింగ్‌ చేయవచ్చు కూడా. కానీ అతడిని మేం మూడో ఓపెనర్‌గానే చూస్తున్నాం. నాకు తెలిసి ప్రపంచకప్‌లో రాహుల్‌ ఓపెనర్‌గానే ఆడతాడు.

అతనో మ్యాచ్‌ విన్నర్‌. గత రెండేళ్లుగా అతని రికార్డు చూస్తే రాహుల్‌ ఎంత కీలక ఆటగాడో తెలుస్తుంది. ఒక మ్యాచ్‌లో ఒకరు బాగా ఆడారని మరో బ్యాటర్‌ను తక్కువ చేస్తే ఎలా. బయట ఏం మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. ఓపెనింగ్‌ గురించి మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. ఆసియాకప్‌లో కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురైనా...కొత్త తరహాలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామని, ఇకపై కూడా అదే శైలిని కొనసాగిస్తామని కూడా రోహిత్‌ అన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతోపాటు టి20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీని ఆదివారం బీసీసీఐ ఆవిష్కరించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top