హార్దిక్‌ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్‌

Virat Kohli Childhood Coach Slams Hardik Pandya Immature Statement - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై విరాట్‌ కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ నిప్పులు చెరిగారు. హార్దిక్‌ మాటల్లో పరిపక్వత కనిపించడం లేదని.. రోజుకో మాట మారుస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం పాండ్యా బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బోరియా కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' టి20 ప్రపంచకప్‌ 2021 సమయానికి నేను 100 శాతం ఫిట్‌గా లేను. ఒక బ్యాటర్‌గా మాత్రమే నన్ను జట్టులోకి ఎంపిక చేశారు. కానీ టోర్నీ మధ్యలో ఆల్‌రౌండర్‌ ట్యాగ్‌తో బౌలింగ్‌ చేయమని చాలెంజ్‌ విసిరారు. బౌలింగ్‌ చేస్తే గాయం తిరగబెడుతుందని తెలుసు.. కానీ అప్పటికి తొలి మ్యాచ్‌లోనే బౌలింగ్‌కు దిగా. కానీ మంచి ప్రదర్శన చేయలేక.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయ్యా. ఇందులో నా తప్పేముంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ranji Trophy 2022: పుజారా, రహానేలకు గంగూలీ పరోక్ష హెచ్చరిక

పాండ్యా ప్రకటన క్రికెట్‌ వర్గాలతో పాటు ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. పలువురు మాజీ ఆటగాళ్లు సైతం పాండ్యా వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆల్‌రౌండర్‌ ట్యాగ్‌ ఇప్పటికైనా తీసేయండి అంటూ పేర్కొన్నారు. ఇదే అంశంపై కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడాడు. '' హార్దిక్‌కు ఫిట్‌నెస్‌ లేకపోయినప్పటికి.. అతనిపై నమ్మకంతో టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తన తప్పు లేనట్లు మాట్లాడుతున్న హార్దిక్‌ పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వాస్తవానికి అతను సెలెక్టర్లకు, మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. అతని వ్యాఖ్యలు అర్థరహితం.'' అంటూ పేర్కొన్నాడు. 

హార్ధిక్‌ పాండ్యా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని మరో మాజీ స్పిన్నర్‌ నిఖిల్‌ చోప్రా తెలిపాడు. ''హార్దిక్‌ పాండ్యా విషయంలో సెలెక్టర్లు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనే క్లారిటీ ఇచ్చారు. అతన్ని కేవలం బ్యాటర్‌గానే తీసుకున్నామని.. అవసరం వచ్చినప్పుడు బౌలింగ్‌ వేస్తాడని తెలిపారు. కానీ హార్దిక్‌ మాత్రం అనవసర స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ తనను తాను బ్యాడ్‌ చేసుకుంటున్నాడు'' అంటూ తెలిపాడు.

ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నుంచి అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీకి మారిన హార్దిక్‌ పాండ్యా  ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతనితో పాటు రషీద్‌ ఖాన్‌, శుబ్‌మన్‌ గిల్‌ను కూడా ఎంపిక చేసింది. హార్దిక్‌, రషీద్‌లకు చెరో రూ.15 కోట్లు.. శుబ్‌మన్‌ గిల్‌కు రూ. 8 కోట్లు వెచ్చించింది. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ మెగావేలం జరగనుంది. 
చదవండి:  యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top