
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా చారిత్రక రికార్డులు సాధించాడు. తాజాగా ఐసీసీ ఆల్‌టైమ్ టీ20 పాయింట్లను అప్‌డేట్ చేయగా.. అందులో విరాట్ కెరీర్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909 పాయింట్లకు పెరిగాయి.
దీంతో విరాట్ మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ (అత్యుత్తమంగా) అందుకున్న తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికే విరాట్ టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా 937, వన్డేల్లో అత్యుత్తమంగా 909 రేటింగ్ పాయింట్స్ కలిగి ఉన్నాడు.
ఐసీసీ టీ20 రేటింగ్ పాయింట్ల అప్‌డేషన్ తర్వాత విరాట్ మరో చారిత్రక రికార్డును కూడా సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్ వన్‌గా కొనసాగిన బ్యాటర్‌గా అవతరించాడు. రేటింగ్ పాయింట్ల అప్‌డేషన్ తర్వాత విరాట్ నంబర్ వన్‌గా కొనసాగిన జమానా 1013 రోజుల నుంచి 1202 రోజులకు మారింది.

రేటింగ్ పాయింట్ల అప్‌డేషన్‌కు ముందు అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ టీ20ల్లో 1057 రోజులు నంబర్ వన్‌గా కొనసాగాడు. తాజా అప్‌డేషన్‌తో విరాట్ బాబర్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక కాలం నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
పై రెండు రికార్డులతో విరాట్ టీ20 కెరీర్ మరింత హైలైట్ అయ్యింది. విరాట్ ఇప్పటికే వన్డే, టెస్ట్‌ల్లో లెక్కలేనన్ని, ఎవరికీ సాధ్యపడని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కొత్తగా చేరిన రెండు రికార్డులతో విరాట్ అంతర్జాతీయ కెరీర్ మొత్తం పరిపూర్ణమైనట్లైంది.

విరాట్ అంతర్జాతీయ కెరీర్‌లో 125 టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్ వన్డేల్లో ఇప్పటివరకు 302 మ్యాచ్‌లు ఆడి 57.9 సగటున 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీల సాయంతో 14181 పరుగులు చేశాడు.