
సోలో (ఇండోనేసియా): భారత రైజింగ్ షట్లర్లు వెన్నెల కలగొట్ల, తన్వీ శర్మలు ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. అండర్–19 మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరడం ద్వారానే కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్న వీళ్లిద్దరికి శనివారం సెమీఫైనల్లో చుక్కెదురైంది. తెలుగమ్మాయి వెన్నెల 15–21, 18–21తో చైనాకు చెందిన లియూ సి యా చేతిలో పోరాడి ఓడింది. 37 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో రెండో గేమ్‌ను చేజిక్కించుకునేందుకు వెన్నెల చెమటోడ్చింది.
15–20తో ఇక మ్యాచ్ ఓడిపోయి స్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశచెందకుండా వరుసగా మూడు పాయింట్లను సాధించి రేసులో నిలిచింది. కానీ చైనా ప్రత్యర్థి ఈ దశలో మరింత జాగ్రత్త పడటంతో గెలిచేందుకు అవసరమైన పాయింట్ సాధించి ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో తన్వీ శర్మ 13–21, 14–21తో ఎనిమిదో సీడ్ యిన్ యి కింగ్ (చైనా) ధాటికి నిలువలేకపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయిన పంజాబీ షట్లర్ ఒక దశలో రెండో గేమ్‌ను దూకుడుగా మొదలుపెట్టింది.
6–1 ఆధిక్యంతో జోరుపెంచింది. కానీ వరుస తప్పిదాలతో పాయింట్లను కోల్పోయి 8–8 వద్ద సమం కాగా అక్కడి నుంచి పట్టు కోల్పోయింది. గత నెల యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన తన్వీ వరుసగా ఈ టోర్నీలో కాంస్యం గెలుపొందడం విశేషం. మొత్తం మీద ఈ జూనియర్ ఆసియా టోర్నీలో 13 ఏళ్ల పతక నిరీక్షణకు వెన్నెల, తన్వీ కాంస్యాలతో తెరదించారు. చివరిసారిగా భారత్ 2012లో స్వర్ణం గెలుచుకుంది. పీవీ సింధు ఆ ఏడాది విజేతగా నిలిచింది.