‘వైభవ్‌ సూర్యవంశీ.. చెప్పిన మాట అసలే వినడు’ | Rising Star Vaibhav Suryavanshi Impresses AB de Villiers, Teammate Jitesh Sharma Shares Behind The Scenes Anecdotes | Sakshi
Sakshi News home page

వైభవ్‌పై డివిలియర్స్‌ ప్రశంసలు!.. ఆర్సీబీ స్టార్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mar 23 2026 2:02 PM | Updated on Mar 23 2026 2:35 PM

Vaibhav Sooryavanshi never be professional: RCB star disagrees with ABD

పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌ ప్రపంచంలో అద్భుతాలు చేశాడు వైభవ్‌ సూర్యవంశీ. ఇటు ఐపీఎల్‌లో.. అటు భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు తరఫునా సత్తా చాటాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో విధ్వంసకర శతకంతో అతి పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.

తద్వారా భారత్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు.

అతడొక గొప్ప ఆటగాడు
ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి సౌతాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ చేసిన వ్యాఖ్యలు.. అందుకు ప్రతిగా టీమిండియా స్టార్‌, ఆర్సీబీ ఆటగాడు జితేశ్‌ శర్మ (Jitesh Sharma) బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘‘అతడొక గొప్ప ఆటగాడు. అండర్‌-19 క్రికెట్‌లో అతడి ఆట తీరును నేను గమనించాను.

ఐపీఎల్‌లాంటి పెద్ద టోర్నీలో ఆడిన తర్వాత అదే స్థాయిలో.. అవే ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగడం అందరికీ సాధ్యం కాదు. అయితే, వైభవ్‌ సూర్యవంశీ మాత్రం వరల్డ్‌కప్‌ టోర్నీలో అంతే ప్రొఫెషనల్‌గా, భయం లేకుండా ఆడటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

 ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు
ఆ వయసుకే అతడు అంతగా పరిణతి చెందిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఎక్కడ ఆడుతున్నా తన గేమ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉంటాడు. తను తనలాగే ఆడతాడు. వేరే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేయడు. బౌలర్లను గౌరవిస్తాడు. చెత్త బంతుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టడు. అతడొక గొప్ప ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు’’ అని డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు.

అయితే, ఇందుకు జితేశ్‌ శర్మ బదులిస్తూ.. ‘‘అతడు అస్సలు ప్రొఫెషనల్‌ కాదు. నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను’’ అంటూ సరాదాగా కామెంట్‌ చేశాడు. ‘‘అందరూ అతడిని ప్రొఫెషనల్‌ అనుకుంటారు. మైదానంలో అతడు ఎలా ఉంటాడన్నది పక్కనపెడితే.. మైదానం వెలుపల మాత్రం అస్సలు చెప్పిన మాట వినడు. రాత్రివేళ ఐస్‌క్రీమ్‌ తినొద్దని నేను ఎంతగానో మొత్తుకున్నా.

చెప్పిన మాట అసలే వినడు
అయినా అతడు నా మాట వినలేదు. ఈ విషయంలో అతడు ఎప్పుడూ ఎవరి మాటా వినడు’’ అని జితేశ్‌ శర్మ వైభవ్‌కు ఉన్న అలవాటు గురించి డివిలియర్స్‌కు చెప్పాడు. కాగా చిన్న వయసు కాబట్టి ఐస్‌క్రీమ్‌ పట్ల వైభవ్‌కు ఆ మాత్రం ఇష్టం ఉండటం సహజమే. 

అయితే, ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో డైట్‌ పాటిస్తూ జీవనశైలిని మెరుగుపరచుకుంటేనే ఫిట్‌గా ఉండి.. అనుకున్న శిఖరాలకు చేరుకోగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏసీసీ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌లో భారత జట్టుకు జితేశ్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. వైభవ్‌ సూర్యవంశీ అందులో సభ్యుడిగా ఉన్నాడు.

చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement