రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీనికి భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేరారు. ఐపీఎల్-2026 తర్వాత ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని శాస్త్రి సూచించాడు.
కాగా 15 ఏళ్ల వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో 15 ఏళ్ల సూర్యవంశీ దుమ్ములేపుతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 236.56 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు చేశాడు. ఈ బీహార్ చిచ్చర పిడుగు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఉతికారేశాడు. దీంతో వైభవ్ సీనియర్ జట్టు తరపున ఆడేందుకు సిద్దంగా ఉన్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
వైభవ్ సూర్యవంశీ కోసం భారత జట్టు తలుపులు ముప్పావు వంతు తెరిచే ఉన్నాయి. ఇది కచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఒక యువ ఆటగాడిని ప్రోత్సహించి, వీలైనంత త్వరగా ప్రధాన జట్టులో భాగం చేయాలనుకుంటే అందుకు అత్యంత అనువైనది టీ20 ఫార్మాటే.
వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అతడికి భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అతడు ప్రపంచ క్రికెట్‌లోని ఎన్నో జట్లలోకి నేరుగా వెళ్లి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు సంపాదించగలడు. యువతకు ఉండే ఆ ఉత్సాహం, తెగింపు అతడి బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చాలామంది అతడికి 15 ఏళ్ళా? 16 ఏళ్ళా? 14 ఏళ్ళా?’ అని అడుగుతున్నాను. అది నాకు అనవసరం. తనకంటే రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ వయసున్న జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అద్భుతం. వయసుతో అతడికి పనిలేదు.
భారత జట్టు త్వరలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కోసం వైభవ్‌ను భారత జట్టుకు ఎంపిక చేసే అవకాశముంది" అని శాస్త్రి ఐసీసీ రివ్యూలో పేర్కొన్నాడు. వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జూన్‌లో శ్రీలంకలో జరగబోయే త్రైపాక్షిక సిరీస్ కోసం 'ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే నెలఖారులో భారత సీనియర్ జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది.
చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు


