US Open 2022: సెరెనాపైనే దృష్టి

US Open 2022: Serena Williams final Grand Slam - Sakshi

నేటి నుంచి యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ  

న్యూయార్క్‌: రిటైర్మెంట్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఇటీవల ప్రకటించిన అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ ప్రధాన ఆకర్షణగా నేడు యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి తెర లేవనుంది. 40 ఏళ్ల సెరెనా ఇప్పటివరకు కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించింది. మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఫైనల్‌ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 21వసారి యూఎస్‌ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా ఆరుసార్లు విజేతగా, నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచింది.

నాలుగుసార్లు సెమీఫైనల్, మూడుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 2008 నుంచి యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా కనీసం సెమీఫైనల్‌ దశ వరకు చేరుకుంటోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్‌ డాంకా కొవినిచ్‌ (మాంటెనిగ్రో)తో ఆడుతుంది. ప్రపంచ నంబర్‌వన్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌), రెండుసార్లు విజేత నయోమి ఒసాకా (జపాన్‌), డిఫెండింగ్‌ చాంపియన్‌ ఎమ్మా రాడుకాను (బ్రిటన్‌), సిమోనా హలెప్‌ (రొమేనియా) టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ మెద్వెదెవ్‌ (రష్యా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), సిట్సిపాస్‌ (గ్రీస్‌), నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా), అల్కారజ్‌ (స్పెయిన్‌) టైటిల్‌ రేసులో ఉన్నారు. పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగం విజేతలకు 26 లక్షల డాలర్ల చొప్పున (రూ. 20 కోట్ల 79 లక్షలు) ప్రైజ్‌మనీ లభిస్తుంది.

భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి గం. 8:30 నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. మ్యాచ్‌లను సోనీ సిక్స్, సోనీ టెన్‌–2, సోనీ టెన్‌–3 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top