Tokyo Paralympics: ‘హై’ పైకి...

Tokyo Paralympics: Thangavelu Mariyappan wins silver, Sharad Kumar takes bronze in men high jump - Sakshi

పారాలింపిక్స్‌లో మరో మూడు పతకాలు

హైజంప్‌లో రజతం, కాంస్యం నెగ్గిన తంగవేలు, శరద్‌

షూటర్‌ సింగ్‌రాజ్‌కు కాంస్యం

విశ్వక్రీడల్లో తొలిసారి రెండంకెలు దాటిన భారత్‌ పతకాల సంఖ్య

దివ్యాంగుల విశ్వక్రీడల్లో ఈసారి గతంలో కంటే ఘనమైన ప్రదర్శన చేస్తామని ప్రకటించిన భారత పారాథ్లెట్స్‌ అన్నమాట నిలబెట్టుకున్నారు. అంచనాలకు మించి రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆదివారం రెండు పతకాలు సాధించిన మనోళ్లు... సోమవారం ఏకంగా ఐదు పతకాలు నెగ్గగా... మంగళవారం మరో మూడు పతకాలు సొంతం చేసుకున్నారు. దాంతో భారత్‌ గెలిచిన పతకాల సంఖ్య 10కి చేరింది. ఒకే ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే ప్రథమం. గత నెలలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యధికంగా ఏడు పతకాలు నెగ్గగా... తాజాగా టోక్యోలోనే జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ 10 పతకాలతో కొత్త చరిత్ర సృష్టించింది.

టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా మూడో రోజు భారత దివ్యాంగ క్రీడాకారులు పతకాల పంట పండించారు. పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి–42 కేటగిరీలో మరియప్పన్‌ తంగవేలు రజతం నెగ్గగా... ఇదే విభాగంలో శరద్‌ కుమార్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. టి–42 కేటగిరీలో కాళ్లలో లోపం, కాళ్ల పొడవులో వ్యత్యాసం, బలహీనమైన కండరాల శక్తి, క్రియాశీలకమైన కదలికలు లేని వారు పాల్గొనవచ్చు. షూటింగ్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీలో సింగ్‌రాజ్‌ అధానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. ఫలితంగా మంగళవారం భారత్‌ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఓవరాల్‌గా భారత్‌ 10 పతకాలతో 30వ స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌లోగానీ, పారాలింపిక్స్‌లోగానీ భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలు దాటడం ఇదే తొలిసారి.  

నాలుగేళ్ల క్రితమే షూటింగ్‌ క్రీడలో అడుగుపెట్టిన సింగ్‌రాజ్‌ పాల్గొన్న తొలి పారాలింపిక్స్‌లోనే పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో సింగ్‌రాజ్‌ 216.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం గెలిచాడు. చావో యాంగ్‌ (చైనా–237.9 పాయిం ట్లు) స్వర్ణం, జింగ్‌ హువాంగ్‌ (చైనా–237.5 పాయింట్లు) రజతం సాధించారు. ఫైనల్లో పాల్గొన్న మరో భారత షూటర్‌ మనీశ్‌ నర్వాల్‌ 135.8 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌–1 కేటగిరీ ఫైనల్లో భారత షూటర్‌ రుబీనా ఫ్రాన్సిస్‌ ఏడో స్థానంలో నిలిచింది.

సొంతంగా రేంజ్‌ ఏర్పాటు చేసుకొని...
హరియాణాలోని ఫరీదాబాద్‌ పట్టణానికి చెందిన 39 ఏళ్ల సింగ్‌రాజ్‌ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే షూటింగ్‌వైపు మాత్రం అతను 35 ఏళ్ల వయసులో ఆకర్షితుడయ్యాడు. తన మేనల్లుడిని షూటింగ్‌ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో అక్కడే సరదాగా ప్రాక్టీస్‌ చేసిన సింగ్‌రాజ్‌ ఆటపట్ల మక్కువ పెంచుకొని సీరియస్‌గా సాధన చేయడం ప్రారంభించాడు. కోచ్‌లు ఓంప్రకాశ్, జేపీ నౌటియాల్, జాతీయ కోచ్‌ సుభాశ్‌ రాణా శిక్షణలో రాటుదేలిన సింగ్‌రాజ్‌ 2018లో ఆసియా పారాగేమ్స్‌లో కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాతి ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజతం, స్వర్ణం గెలిచాడు.

యూఏఈలో ఈ ఏడాది జరిగిన పారాస్పోర్ట్‌ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన సింగ్‌రాజ్‌ కోవిడ్‌–19 సమయంలో షూటింగ్‌ రేంజ్‌లకు తాళాలు పడటంతో ప్రాక్టీస్‌ లేక ఇబ్బంది పడ్డాడు. పారాలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్న సింగ్‌రాజ్‌ కుటుంబసభ్యుల ఆర్థిక సహాయంతో ఇంట్లోనే సొంతంగా షూటింగ్‌ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్‌ కొనసాగించాడు. విశ్వ క్రీడల్లో పతకంతో తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.

మళ్లీ మెరిసిన తంగవేలు...
2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన మరియప్పన్‌ తంగవేలు టోక్యోలోనూ అదరగొట్టాడు. పురుషుల హైజంప్‌ టి–42 విభాగంలో పోటీపడిన ఈ తమిళనాడు ప్లేయర్‌ 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి రజత పతకం సాధించాడు. తాను స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ పోటీలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడం తన స్వర్ణావకాశాలను ప్రభావితం చేసిందని 26 ఏళ్ల తంగవేలు అన్నాడు. ఐదేళ్ల ప్రాయంలో బస్సు ప్రమాదానికి గురై కుడి కాలును కోల్పోయిన తంగవేలు స్కూల్‌లో వ్యాయామవిద్య ఉపాధ్యాయుడి సలహాతో అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాడు.

కూరగాయాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తన తల్లి సరోజకి చేదోడు వాదోడుగా ఉండేందుకు తంగవేలు 2012 నుంచి 2015 మధ్య కాలంలో ఇళ్లల్లో పేపర్లు వేశాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి తంగవేలు ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. ‘రియో’ పతకంతో లభించిన నగదు ప్రోత్సాహకాలతో ఆర్థికంగా స్థిరపడ్డాడు. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లోనూ పాల్గొంటానని, ఆ క్రీడల్లో స్వర్ణం సాధించేందుకు ఇప్పటి నుంచే సాధన మొదలుపెడతానని తంగవేలు వ్యాఖ్యానించాడు.

నాన్న సలహాతో...
టి–42 విభాగంలోనే పోటీపడిన మరో భారత హైజంపర్‌ శరద్‌ కుమార్‌ 1.83 మీటర్ల ఎత్తుకు ఎగిరి కాంస్య పతకాన్ని సాధించాడు. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల శరద్‌ రెండేళ్లుగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. సోమవారం రాత్రి మోకాలి నొప్పితో బాధపడ్డ శరద్‌ ఈవెంట్‌ నుంచి వైదొలగాలని భావించాడు. అయితే తండ్రి సూచన మేరకు భగవద్గీత పఠించి మంగళవారం ఈవెంట్‌లో పాల్గొని శరద్‌ పతకం సాధించాడు. ‘సోమవారం రాత్రంతా మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఈ విషయాన్ని ఫోన్‌లో నాన్నకు వివరించాను. ఈవెంట్‌లో పాల్గొనడం కష్టమని చెప్పాను. పట్టుదల కోల్పోకుండా తనవంతు ప్రయత్నం చేయాలని... తమ నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించకూడదని నాన్న సలహా ఇచ్చారు. భగవద్గీత చదవాలని సూచించారు’ అని రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ శరద్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top