Tokyo Paralympics: 5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తాం..

Tokyo Paralympics: India Will Win At Least 15 Medals Including 5 Golds Says Chef De Mission Gursharan Singh - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరగనున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌ బృందం 5 స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు గెలుస్తుందని భారత పారా ఒలింపిక్స్‌ కమిటీ సెక్రటరీ జనరల్‌ గరుశరణ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమమైందని, పారా ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ ఎన్నడూ సాధించని పతకాలు ఈ పారా ఒలింపిక్స్‌లో సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో పారా ఒలింపిక్స్‌ తర్వాత అథ్లెట్లంతా అంతర్జాతీయ టోర్నీల్లో రాణించారని, త్వరలో ప్రారంభంకాబోయే పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు వారంతా ఉవ్విళ్లూరుతున్నారని, ఇదే తమ ధీమాకు కారణమని వెల్లడించారు. 

అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, ఆర్చరీ విభాగాల్లో భారత్‌ కచ్చితంగా పతకాలు సాధిస్తుందని, పారా హైజంప్‌లో భారత పతాకధారి మరియప్పన్‌ తంగవేలు మరోసారి పసిడి ముద్దాడుతాడని గురుశరణ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాగా, టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత్‌ 54 మందితో కూడిన జంబో బృందాన్ని బరిలోకి దించుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, కెనోయింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో తదితర క్రీడల్లో వీరంతా పోటీ పడనున్నారు. భారత్‌ ఇప్పటి వరకు 11 పారా ఒలింపిక్స్‌ క్రీడల్లో కేవలం 12 పతకాలే సాధించగా, గడిచిన 2016 రియో పారా ఒలింపిక్స్‌లో 2 స్వర్ణాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు గెలవడం గమనార్హం.
చదవండి: కివీస్‌ క్రికెటర్లను భయపెడుతున్న తాలిబన్లు.. పాక్‌ పర్యటనపై నీలినీడలు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top