Tokyo Olympics: అమ్మ నగలు అమ్మితే 6 వేలు.. దీనస్థితి.. కానీ ఇప్పుడు

Tokyo Olympics: Bhavani Devi First Indian Fencer Qualify Interesting Facts - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: వెయిట్‌ లిఫ్టింగ్‌... హాకీ.. రెజ్లింగ్‌.. జిమ్నాస్టిక్స్‌.. షూటింగ్‌.. బ్యాడ్మింటన్‌.. ఇలా ప్రతి విభాగంలోనూ భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు భారతీయ మహిళా మణులు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌-2020లో రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించిన ‘వెండి కొండ’గా నీరజనాలు అందుకుంటోంది వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను. ఇక బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ (58 కేజీల విభాగం)లో సాక్షి మాలిక్‌ గతంలో పతకాలు సాధించారు.

అయితే, ఈ క్రీడలన్నింటికీ భిన్నంగా వినూత్న మార్గాన్ని ఎంచుకుంది సీఏ భవానీ దేవి. ఎవరికీ అంతగా పరిచయం లేని ‘ఫెన్సింగ్‌’ క్రీడాంశాన్ని ఎంపిక చేసుకోవడమే గాకుండా.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నుంచి ఒలంపిక్‌ క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరిన భవానీ దేవి గురించిన ఆసక్తికర అంశాలు మీకోసం. 

11 ఏళ్ల వయస్సులోనే..
సీఏ భవానీ దేవి పూర్తి పేరు.. చదలవాడ ఆనంద సుందరరామన్‌ భవానీ దేవి. స్వస్థలం చెన్నై. ఆమె తండ్రి ఆలయ పూజారి. తల్లి గృహిణి. మరుగు ధనుష్కోడి గర్ల్స్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో విద్యనభ్యసించిన భవానీ దేవి.. పదకొండేళ్ల వయస్సు నుంచే ఫెన్సింగ్‌ వైపు ఆకర్షితురాలైంది. ఎపీ, ఫాయిల్‌, సబ్రే.. ఈ మూడు విభాగాల్లో సబ్రేను తన క్రీడాంశంగా ఎంచుకుంది. 

తొలిసారే చేదు అనుభవం..
పద్నాలుగేళ్ల వయస్సులో టర్కీలో జరిగిన పోటీల్లో తొలి సారిగా భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రీడల్లో భవానీ దేవి పాల్గొంది. అయితే, దురదృష్టవశాత్తూ.. మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మలేషియాలో జరిగిన కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌-2009లో పాల్గొన్న భవానీ దేవి.. తొలిసారిగా పతకం సాధించింది. 

ఆ తర్వాత 2010లో ఇంటర్నేషనల్‌ ఓపెన్‌, కాడెట్‌ ఏసియన్‌ చాంపియన్‌షిప్‌-2010, కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌-2021, 2015 అండర్‌-15 ఏసియన్‌ చాంపియన్‌షిప్‌, ఫ్లెమిష్‌ ఓపెన్‌లో కాంస్య పతకాలు, అండర్‌-23 ఏసియన్‌ చాంపియన్‌షిప్‌-2014లో రజతం గెలుచుకుంది. కెరీర్‌లో మొత్తంగా తొమ్మిది నేషనల్‌ టైటిళ్లు సాధించిన భవానీ దేవి ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన ఆమె ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. భవానీ దేవి ఎదుర్కొన్న ఆటంకాలు, అవరోధాల గురించి ఆమె మాటల్లోనే...

అమ్మ నాకోసం తన నగలు అమ్మింది..
‘‘పదకొండేళ్లు ఉన్నపుడు తొలిసారి స్కూళ్లో ఫెన్సింగ్‌ను ఎంచుకున్నాను. ఎందుకో నాకు ఆ పేరే కొత్తగా, ప్రత్యేకంగా అనిపించేది. రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోయింది. అయితే నాతో పాటు ఈ క్రీడను ఎంచుకున్న అమ్మాయిలు మధ్యలోనే డ్రాప్‌ అయ్యేవారు. కానీ నేను సీరియస్‌గా తీసుకున్నా. ముఖ్యంగా మా అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది. ‘‘నీకు ఏదైతే నచ్చుతుందో అదే బాటలో నడువు’’ అని ఎల్లప్పుడూ అండగా ఉండేవారు.

కేవలం మాటలకే పరిమితం కాలేదు వాళ్లు. మా నాన్న పూజారి. అమ్మ గృహిణి. నా తొలి ఫెన్సింగ్‌ కిట్‌ కొనడానికి అమ్మ తన నగలు అమ్మింది. 6 వేల రూపాయలు వచ్చాయి. అంతటితో వారి ప్రయత్నం ఆగిపోలేదు. స్పాన్సర్లను వెతకడానికి గంటల తరబడి వివిధ ఆఫీసుల్లో వేచి చూసేవారు. నిరాశతో ఇంటికి వచ్చినా.. చిరునవ్వు చెరగనీయక మంచి రోజులు వస్తాయంటూ వెన్నుతట్టేవారు.  వారి ఆశలు, ఆశయం నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

అయితే ఎంత కష్టపడినా ఫలితం ఉండేది కాదు. మెంటార్‌ ఉంటే బాగుంటుందని భావించాను. అప్పుడే ఓ వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చారు. ఆయన వల్లే అండర్‌-19 నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాను. అయితే, విదేశీ పర్యటనల ఖర్చులు భరించే స్థోమత లేక 2013లో ఫెన్సింగ్‌ను వదిలేద్దామనుకున్నా. అప్పటికే నా కోసం రూ. 10 లక్షల లోన్‌ తీసుకున్నారు. ‘‘అమ్మ.. ఇంతకంటే నాకోసం మీరు కష్టపడవద్దు. మన కుటుంబం ఈ దీన పరిస్థితిలో ఉండటం చూడలేను’’ అని అమ్మతో చెప్పాను. కానీ తను మత్రం.. ‘‘శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది’’ అని నన్ను ఓదార్చింది. నాలో విశ్వాసం నింపింది.

గట్టిగా ఏడ్చేశాను... అమ్మ భయపడిపోయింది
2014 నుంచి కఠోర సాధన చేశాను. ఏసియన్‌ చాంపియన్‌షిప్‌లో ఫెన్సింగ్‌ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాను. అయినా, కష్టాలు వీడలేదు. ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారింది. విదేశాల్లో జరిగే టోర్నీలకు వెళ్లలేని దుస్థితి. అందుకే అప్పటి సీఎం జయలలిత మేడంకి లేఖ రాశాను. ఆమె నన్ను తన నివాసానికి పిలిపించి, ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి అదృష్టం వరించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం.

ఈ వార్త వినగానే గట్టిగా ఏడ్చేశాను. అమ్మ భయపడిపోయింది. మర్లే పర్లేదు బేటా.. వచ్చేసారి నీకు అవకాశం వస్తుందిలే అని నన్ను బుజ్జగించింది. అసలు విషయం చెప్పిన తర్వాత తన ఆనందానికి అవధుల్లేవు. ఇటీవలి చాంపియన్‌షిప్‌ గెలిచిన తర్వాత 10 లక్షల లోన్‌ తిరిగి కట్టగలిగాను. మా అమ్మ వాళ్ల కోసం ఒక ఇల్లు కొనడం నా ముందున్న ఆశయం. నన్ను ఇంతదాకా తీసుకువచ్చిన నా కుటుంబం, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బంగారు పతకం సాధించి అమ్మను సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాను’’ అని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భవానీ దేవి తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. ఆమె కోరుకున్నట్లు స్వర్ణం సాధించి, విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిస్తూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం!!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top