
డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా ప్రపంచకప్-2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు ఫాన్స్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఆనారోగ్యం పాలయ్యారు. ఫ్రాన్స్ ఆటగాళ్లు రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్‌లీ కొమన్ వైరల్ ఫ్లూ బారిన పడినట్లు సమాచారం.
దీంతో ఈ ముగ్గురు శుక్రవారం తమ ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. కాగా మొరాకోతో సెమీఫైనల్లో ఫ్రాన్స్ సబ్‌స్టిట్యూట్‌గా కోమన్ ఎంపికయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోమన్ అవసరం ఫ్రాన్స్‌కు రాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో మొరాకోను ఫ్రాన్స్ 2-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది.
ముఖ్యంగా వారానే, ఇబ్రహీం కొనాటేల ఆనారోగ్యం ఫ్రాన్స్ జట్టును కలవరపెడుతోంది. ఎందుకంటే వీరిద్దరూ మిడ్ ఫీల్డ్‌లో కీలకమైన ఆటగాళ్లు. మొరాకోతో జరిగిన సెమీఫైనల్‌కు దయోట్ ఉపమెకానో స్థానంలో జట్టులోకి వచ్చిన కోనాటే అదరగొట్టాడు. ఫ్రాన్స్ డిఫెన్స్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇక ఇదే విషయంపై ఫ్రాన్స్ ఫార్వార్డర్లు రాండల్ కోలో, డెంబెలే స్పందించారు.
"వారానే, కొనాటే, కొమన్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే లక్షణాలు తేలికపాటిగానే ఉన్నాయి. ఈ ముగ్గురు ఫైనల్ మ్యాచ్‌కు ముందు కోలుకుంటారని అశిస్తున్నాను" అని రాండల్ కోలో పేర్కొన్నాడు.
చదవండి: FIFA WC 2022: ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్.. ట్రెండింగ్‌లో ఎస్‌బీఐ పాస్‌బుక్