Temba Bavuma: కెప్టెన్సీ తెచ్చిపెట్టని స్థానం సెంచరీ తెచ్చిపెట్టింది

Temba Bavuma Gets SA20 Contract - Sakshi

SA20, 2023: స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడంతో ఘోరంగా అవమాన పడ్డ సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్‌ టెంబా బవుమాకు ఊరట లభించింది. ఎట్టకేలకే బవుమాను ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యంలోని జట్టైన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ బవుమాను తదుపరి లీగ్‌లో ఆడించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఫ్రాంచైజీ యాజమాన్యం గురువారం (ఫిబ్రవరి 2) ప్రకటన విడుదల చేసింది.

బవుమాకు జాతీయ జట్టు కెప్టెన్సీ తెచ్చిపెట్టని స్థానాన్ని.. ఇటీవల ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ సాధించిపెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్వదేశంలో తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బవుమా వరుసగా 36, 109, 35 స్కోర్లు చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే సన్‌రైజర్స్‌ యాజమాన్యం అతన్ని మరో ఆటగాడి​కి రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది.

తదుపరి జరుగబోయే లీగ్‌లో బవుమాతో పాటు పలు ఫ్రాంచైజీలు రీప్లేస్‌మెంట్లు చేసుకునున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యంలోని జోబర్గ్‌ సూపర్‌కింగ్స్‌.. విండీస్‌ ఆటగాడు అల్జరీ జోసఫ్‌ స్థానంలో ఆసీస్‌ వెటరన్‌ వికెట్‌కీపర్‌ మాథ్యూ వేడ్‌ను ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌ టీమ్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఓలీ స్టోన్‌ స్థానాలను టిమ్‌ డేవిడ్‌, హెన్రీ బ్రూక్స్‌లతో భర్తీ చేసింది.

కాగా, అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు 8 రోజుల గ్యాప్‌ పడింది. తిరిగి మ్యాచ్‌లు ఇవాల్టి (ఫిబ్రవరి 2) నుంచే ప్రారంభమయ్యాయి. ఇవాళ డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌-ఎంఐ కేప్‌టౌన్‌ తలపడుతున్నాయి. ప్రస్తుతానికి లీగ్‌ పాయింట్ల పట్టికలో ప్రిటోరియా క్యాపిటల్స్‌ (23 పాయింట్లు), సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ (17), పార్ల్‌ రాయల్స్‌ (17), జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ (16), ఎంఐ కేప్‌టౌన్‌ (13), డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ (8) వరుస స్థానాల్లో ఉన్నాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top