తెలంగాణ ‘డబుల్‌’ ధమాకా

Telangana athletes add four more medals at National games - Sakshi

బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్‌లో స్వర్ణాలు

స్విమ్మింగ్‌లో రజతం, రోయింగ్‌లో కాంస్యం

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతోపాటు ఒక రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సొంతం చేసుకున్నారు. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో తెలంగాణ 3–0తో కేరళను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి జోడీ 21–15, 14–21, 21–14తో ట్రెసా జాలీ–ఎం.ఆర్‌.అర్జున్‌ ద్వయంపై గెలిచి తెలంగాణకు 1–0 ఆధిక్యం అందించింది.

రెండో మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ 18–21, 21–16, 22–20 తో ప్రణయ్‌ను ఓడించి తెలంగాణ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో సామియా ఇమాద్‌ ఫారూఖి 21–5, 21–12తో గౌరీకృష్ణపై గెలవడంతో తెలంగాణ విజయం ఖరారైంది. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు. మహిళల బాస్కెట్‌బాల్‌ 3గీ3 ఈవెంట్‌ ఫైనల్లో తెలంగాణ జట్టు 17–13తో కేరళను ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకుంది.  

మహిళల స్విమ్మింగ్‌ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో తెలంగాణ అమ్మాయి వ్రిత్తి అగర్వాల్‌ రజత పతకం దక్కించుకుంది. ఆమె 9ని:23.91 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది.  
పురుషుల రోయింగ్‌ కాక్స్‌డ్‌–8లో బాలకృష్ణ, నితిన్‌ కృష్ణ, సాయిరాజ్, చరణ్‌ సింగ్‌ కెతావత్, మహేశ్వర్‌ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్‌ సింగ్, వెల్ది శ్రీకాంత్‌లతో కూడిన తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top